శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జులై 2020 (09:00 IST)

నేడు రిలయన్స్ ఏజీఎం మీటింగ్ - మరో సంచలన నిర్ణయం?

దేశ పారిశ్రామిక దిగ్గజ కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీ వార్షిక సర్వసభ్య సమావేశం గురువారం జరుగనుంది. ఈ సమావేశంలో ఆ సంస్థ అధిపతి ముఖేశ్ అంబానీ మరో సంచలన నిర్ణయం వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, సరికొత్త ఫోనుతోపాటు.. మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
కాగా, ప్రపంచ కార్పొరేట్ చరిత్రలో, అందునా టెలీకమ్యూనికేషన్స్ ఇండస్ట్రీలో దూసుకెళుతూ దిగ్గజాల నుంచి వేల కోట్ల పెట్టుబడులను జియో ప్లాట్ ఫామ్స్ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, కరోనా కష్టకాలంలో ఈ సంస్థలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. దీంతో ముఖేశ్ అంబానీ తన సంపదను మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు జరిగే ఏజీఎంలో జియో ఫోన్-3ని ఆయన ఆవిష్కరిస్తారని, ఇది చాలా చౌక ధరకు లభిస్తుందనే వార్తలు వస్తున్నాయి. 
 
కాగా, 2017 జూలై 21న జరిగిన రిలయన్స్ 40వ ఏజీఎంలో జియో ఫోన్‌ను ముఖేశ్ అంబానీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అప్పట్లో అదో సంచలనం. దేశ 4జీ చరిత్రగతినే మార్చేసింది. ఇండియాలో స్మార్ట్ ఫోన్ల సంఖ్యను కోట్లల్లోకి పెంచింది. ప్రతి ఒక్కరికీ డేటాను దగ్గర చేసింది. ఆపై 2018లో జరిగిన 41వ సమావేశంలో జియో ఫోన్ 2ను ముఖేశ్ విడుదల చేశారు.
 
ఇపుడు జియో స్మార్ట్ ఫోన్లలో మూడోతరం ఫోన్ నేడు ప్రజల ముందుకు వస్తుందని సంస్థ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ఐదు అంగుళాల డిస్‌ప్లేతో ఉంటుందని, చూసేందుకు యాపిల్ చిన్న ఫోన్‌లా కనిపించే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5 ఎంపీ కెమెరా, 64 జీబీ అంతర్గత మెమొరీ ఉంటాయని సమాచారం. దీని ధరలను మాత్రం గోప్యంగా ఉంచారు. ఈ విషయాలను బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే సమావేశంలో ముఖేశ్ అంబానీ స్వయంగా వివరిస్తారు.
 
అంతేకాకుండా, ఈ సమావేశంలో ముఖేశ్ అంబానీ, ఇటీవలి సంస్థ విజయాలను, గత సంవత్సరం తాను హామీ ఇచ్చినట్టుగా సంస్థను రుణ విముక్తం చేశానని చెప్పనున్నారని, అలాగే, సంస్థ భవిష్యత్ ప్రణాళికలను ఆయన వివరిస్తారని తెలుస్తోంది. హైడ్రోకార్బన్స్ రంగంతో పాటు టెలీకమ్యూనికేషన్స్, టెక్నాలజీ, సోషల్ మీడియా, వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్స్ పైనా ఆయన మాట్లాడతారని సమాచారం.