శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 మే 2020 (17:14 IST)

రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ : ఎవరికి ఎంతెంత? గుట్టువిప్పిన నిర్మలమ్మ

కరోనా వైరస్ దెబ్బకు కుదైలైన భారతావనిని తిరిగి పునరుజ్జీవం కల్పించేందుకు ఉద్దేశించి తయారు చేసిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ సమగ్ర వివరాలను కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వెల్లడించారు. భారత్‌ను స్వయం ప్రతిపత్తి గల దేశంగా నిర్మించడానికే ప్రధాని మోడీ రూ.20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని గుర్తుచేశారు.
 
ఆత్మ నిర్భర భారత్‌కు ఐదు అంశాలను మూల స్తంభాలన్నారు. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్‌ సూత్రాలు ఆత్మ నిర్భర భారత్‌కు మూల స్తంభాలుగా చెప్పారు. భూమి, నగదు లభ్యత, పాలనాపరమైన విధానాలే కీలకం అన్నారు. స్థానిక బ్రాండ్లకు అంతర్జాతీయ స్థాయి కల్పించడమే తమ లక్ష్యమన్నారు.
 
గత 40 రోజుల్లో మన శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు. భారత్‌ స్వయంపూర్వకంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రధాని ఒక సమగ్రమైన దార్శనికతను దేశం ముందుంచారన్నారు. వివిధ స్థాయిల్లో సంప్రదించాకే ప్రధాని ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. పీపీఈ కిట్లు, మాస్క్‌ల తయారీలో ఎంతో ప్రగతి సాధించామన్నారు. 
 
ముఖ్యంగా ఈ ప్యాకేజీలో ఎవరికి ఎంతెంత కేటాయించారో కూడా ఆమె వివరించారు. ఈ ప్యాకేజీలో 15 అంశాల్లో కేటాయింపులు ఉంటాయన్నారు. అందులోని వివరాలను రోజుకొకటి చొప్పున వెల్లడిస్తామని తెలిపారు. అందులోభాగంగా, ఈరోజు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రకటిస్తున్నామని తెలిపారు.
 
ఆర్థిక ఇబ్బందులతో కార్యకలాపాలు నిలిపివేసిన సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండానే రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.3 లక్షల కోట్ల రుణాలను ఆమె ప్రకటించారు.
 
అక్టోబరు వరకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని నిర్మల స్పష్టం చేశారు. 12 నెలల మారిటోరియంతో ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. రుణాల చెల్లింపునకు నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుందని తెలిపారు. 
 
45 లక్షల పరిశ్రమలకు ఈ ఉద్దీపనతో ప్రయోజనం చేకూరునున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. అంతేకాదు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ఈక్విటీ నిధికి రూపకల్పన చేశామని, కార్యకలాపాలు విస్తరించి మెరుగైన అవకాశాలు అందుకునేందుకు అవకాశం ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడమే ఈక్విటీ నిధి ఉద్దేశమని తెలిపారు.