రూపాయి ఢమాల్.. చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు స్థాయికి...
భారత కరెన్సీ రూపాయి విలువ నానాటికీ దిగజారిపోతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ ఏకంగా 83 రూపాయలకు చేరింది.
గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ముందుకు సాగుతూ వచ్చిన రూపాయి విలువ బుధవారం మాత్రం తొలిసారిగా 83 రూపాయల దిగువకు పడిపోయి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి చేరింది.
బుధవారం 82.30 వద్ద ట్రేడింగ్ ప్రారంభంకాగా, ఆ తర్వాత ఒక దశలో 82.95 రూపాయలకు పడిపోయింది. మంగళవారం నాటికి క్లోజింగ్‌తో పోలిస్తే నిన్న ఒక్క రోజే 61 పైసలు క్షీణించి 83.02 దిగువకు పడిపోయింది. రూపాయి చరిత్రలోనే 83 కిందికి పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
నిజానికి బుధవారం సెషన్ ఆరంభంలో రూపాయి సానుకూలంగానే ట్రేడ్ అయింది. అయితే ఆ తర్వాత క్రమంగా నష్టాల్లో జారుకుంది. ఇది మరింత పతనమై 83.50 దిగువకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రూపాయి విలుప నానాటికీ దిగజారిపోతుండటంతో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వడ్డీరేట్లను పెంచడంపై భారతీయ రిజర్వు బ్యాంకు దృష్టిసారించే అవకాశం ఉందని వారు అంటున్నారు.