శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (19:38 IST)

ఐఏఎస్ సాధన కోసం ఢిల్లీ వరకు వెళ్ళ వలసిన అవసరం లేదు

స్పష్టమైన కార్యాచరణ అలవరుచుకుంటే ఐఏఎస్ సాధన కోసం ఢిల్లీ వరకు వెళ్ళ వలసిన అవసరం లేదని స్ధానికంగానే దానిని సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ హేమ చంద్రారెడ్డి స్పష్టం చేశారు. అఖిల భారత సర్వీసుల వంటి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే కృషి, పట్టుదల అత్యావశ్యకమన్నారు.
 
కానూరు మన గార్డెన్స్ వేదికగా గురువారం నిర్వహించిన తక్షశిల ఐఎఎస్ అకాడమీ ఆరవ వార్షికోత్సవ వేడుకలకు హేమచంద్రారెడ్డి  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి  ఫ్రోఫెసర్ హేమ చంద్రా రెడ్డి మాట్లాడుతూ లక్ష్య సాధనలో ఎవరి మార్గం వారిదేనని ఒకరు అనుసరించిన మార్గం మరొకరికి దారి చూపలేక పోవచ్చని వివరించారు. నిరంతర శ్రమ, తెలివితేటలతో పాటు అదృష్టం కూడా సివిల్స్ సాధనలో కీలకమన్నారు.
 
లక్ష్య సాధనకు దగ్గర దారులు లేవని నిరంతర శ్రమతోనే ఆశించిన లక్ష్యాన్ని సాధించగలుగుతారని అన్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం తక్షశిల ఐఎఎస్ అకాడమీ జాతీయ స్థాయి అధ్యాపకులను విజయవాడ రప్పించి శిక్షణను ఇప్పించటం ముదావహం అన్నారు. ఐఎఎస్ సాధన కోసం పాఠశాల స్థాయి నుండే విద్యార్థి విషయ పరిజ్ఞానంతో బలంగా తయారు కావలసి ఉందని హేమచంద్రా రెడ్డి వివరించారు. కేవలం పుస్తక పరిజ్ఞానానికి పరిమితం కాకుండా జనరల్ నాలెడ్జి పట్ల అవగాహన కలిగి ఉండాలని, న్యూస్ పేపర్ రీడింగ్ అనేది దినచర్యలో భాగంగా ఉండాలని సూచించారు.
 
అకాడమీ అకడమిక్ డైరెక్టర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్. నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్నో వడపోతలను అధిగమించి ఐఏఎస్, ఐపిఎస్ వంటి అఖిల భారత సర్వీసులను అందిపుచ్చుకోవటం సులభ విషయం కాదని ఇందుకు ఎంతో మానసిక పరిణితి అవసరమని సూచించారు. విద్యా విషయపరంగా ఉన్నతమైన పరిజ్ఞానం ఉన్నప్పటికీ మానసిక పరిణితి లోపిస్తే ఇంటర్వ్యూలో ఒత్తిడికి గురికాక తప్పదని పేర్కొన్నారు.
 
తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఎండి డాక్టర్ బిఎస్ఎన్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ స్థాపించిన ఏడు సంవత్సరాలలోనే 10 ర్యాంకులను పొందగలిగామన్నారు. అన్ని వర్గాలకు అందుబాటులో తమ విద్యా సంస్థ సేవలు అందిస్తుందని తెలివితేటలు, ఆసక్తి ఉండి ఆర్థికపరమైన ఇబ్బందులవల్ల సమీకృత సివిల్స్ శిక్షణను పొందలేని వారి కోసం తక్షశిల ఐఏఎస్ అకాడమీ ఉపకార వేతనాలను కూడా అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విభిన్న అంశాలలో ప్రతిభ కనపరిచిన  విద్యార్థులకు జ్ఞాపికలను అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్ధులు నిర్వహించిన ప్యాషన్ షో అదరహా అనిపించింది.