ఉద్యోగంలో ఓడిపోతే... జీవితంలో గెలిచేది ఎలా? ఆ మూడు తప్పులు...

Last Modified బుధవారం, 19 డిశెంబరు 2018 (15:20 IST)
కెరీర్ గ్రాఫ్ ఎక్కుపెట్టిన బాణంలా పైపైకి సాగి లక్ష్యాన్ని చేరుకోవాలి కానీ గాలిలో విసిరిన రాయిలా ఎక్కడ పడుతుందోనన్నట్లుగా వుండరాదు. సహజంగా కెరీర్లో స్థిరపడ్డాక ఎదుగుదల కోసం ప్రయత్నించాలి. ఐతే కుటుంబపరమైన సమస్యలు, వ్యక్తిగత సమస్యలను కెరీర్ పైన రుద్దుకుంటూ చేసే పనిపై ధ్యాస కోల్పేయేవారి సంఖ్య 40 శాతానికి పైగానే వున్నట్లు ఇటీవలి సర్వేల్లో వెల్లడైంది. ఈ 40 శాతం మంది ఉద్యోగంలో ఓడిపోయి రాజీనామాలు చేసేసి ఆ తర్వాత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతుంటారు.

ఐతే ఆ పరిస్థితి రాకుండా కెరీర్ గ్రాఫ్ ఆరోగ్యకరంగా వుంచుకునేందుకు రోజూ ప్రయత్నించాలి. ఎలాగంటే... ఉద్యోగంలో చేరిన కొత్తలో ఉద్యోగం వచ్చిందన్న సంతోషం, ఆ ఉద్యోగాన్ని పదిలంగా చూసుకోవాలన్న ఆరాటం... దానితో ముందుకు సాగాలన్న లక్ష్యం ఎలా వుంటుందో... అలాగే ప్రతిరోజూ మొదటిరోజులా పరిగణించుకుంటూ ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఇకపోతే కెరీర్ ఎదుగుదలలో చాలామంది చేసే మూడు తప్పులు వున్నాయి. అవేంటో చూద్దాం.

1. మద్దతు లేదని ఒంటరి కావడం...
పనిచేసే చోట తనకు ఎవరి సహకారం లేదని ఒంటరిగా మారిపోవడం. ఇది చాలా తప్పు. ఎవ్వరూ మీ కోసం పనిచేయరు. వాళ్లకోసం వారు పని చేస్తుంటారు. కాబట్టి ఏ విషయంలోనైనా సహకారం కావాలంటే నిరభ్యంతరంగా తోటి ఉద్యోగులను, పైఅధికారులను సంప్రదించడం ద్వారా చేసే పనిలో అవరోధాలను అధిగమించాలి. కానీ ఈ పని చేయడం నావల్ల కాదని వదిలేస్తే కెరీర్ ఎదుగుదలకు అది అడ్డంకిగా మారుతుంది.

2. తప్పు చేయడమే కాక ఒత్తిడితో సతమతం...
పనిపై ధ్యాస లేనప్పుడు పనిలో తప్పులు దొర్లుతాయి. ఫలితంగా పైఅధికారుల నుంచి మందలింపులు సహజమే. ఆ మందలింపుకు కారణం తెలుసుకుని సరిదిద్దుకోవాలి తప్ప ఒత్తిడికి లోనై ఉద్యోగం మానేయడం సరైంది కాదు. ఇలా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోతే తాత్కాలికంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు కానీ అంతకుమించి వందరెట్లు సవాళ్లు కాచుకుని కూర్చుని వుంటాయని గుర్తుంచుకోవాలి.

3. ప్రణాళికాలోపం...
పని పట్ల ఓ ప్రణాళిక లేకపోవడంతో అంతా చిందరవందరగా మారిపోతుంది. దాంతో సరైన సమయానికి లక్ష్యాన్ని చేరలేకపోతారు. ఫలితంగా విసుగు వచ్చేస్తుంది. దాంతో... ఇక్కడ చేసే కంటే ఏదైనా రోడ్డు పక్కన పనిచేసుకుని బతకవచ్చు అని తమలో తామే అనుకుంటారు. కానీ రోడ్డు పక్కన పని చేస్తే కానీ తెలియదు అది ఎంత కష్టమైనదో. కాబట్టి ఏ పనీ అంత సులభంగా ఏమీ ఉండదు. అది రోజుకి 10 రూపాయల పనైనా పదివేల రూపాయల పనైనా. కాబట్టి కెరీర్ ఎదుగుదలకు ప్రధానమైన అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు సాగితేనే వ్యక్తిగతంగా సంతోషంగా వుండటమే కాకుండా యాజమాన్యానికి సంతోషం పంచినవారుగా వుంటారు.దీనిపై మరింత చదవండి :