'టోఫెల్ 2014' స్కాలర్‌షిప్‌ల ప్రదానం!
గత 2014 సంవత్సరానికి గాను టోఫెల్ ప్రతిభా స్కాలర్‌షిప్‌లను యుఎస్ కౌన్సిల్ జనరల్ ఫిలిప్‌మిన్ ప్రదానం చేశారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ ఉపకారవేతనాలను విజేతలకు అందజేశారు. ఈ స్కాలర్‌షిప్‌లో కోసం లక్షలాది మంది పోటీ పడ్డారు. వీరిలో టాన్ విద్యార్థులను వివిధ ప్రతిభా పరీక్షలు, వడపోతల ద్వారా ఎంపిక చేసి, ఒక్కో విద్యార్థికి 7 వేల అమెరికా డాలర్ల చొప్పున ఉపకారవేతనాన్ని అందజేశారు. ఈ అవార్డులను ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఆధ్వర్యంలో ప్రదానం చేయడం జరిగింది.
టోఫెల్ స్కాలర్‌షిప్పులపై టోఫెల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జెన్నీఫర్ బ్రౌన్ స్పందిస్తూ.. అత్యున్నత ప్రతిభా పాఠవాలు ప్రదర్శించే విద్యార్థులను ఎంపిక చేసి ఈటీఎస్ టోఫెల్ 2014 స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఉపకారవేతనాన్ని పొందిన విద్యార్థులు తాము కోరుకునే మొదటి రెండు విశ్వవిద్యాలయాల్లో చేరవచ్చన్నారు.
కాగా, 2014 టోఫెల్ పురస్కారాలను పొందిన వారిలో సన్యా శరణ్ (న్యూఢిల్లీ), ఇషాన్ ఆరోరా (న్యూఢిల్లీ), ప్రగ్యా చావ్లా (న్యూఢిల్లీ), పద్మప్రియ దురైస్వామి (చెన్నై), విజితా కామత్ (ముంబై), శ్రేయా రామచంద్రన్ (బెంగుళూరు), అనూప్ రాజప్పన్ (చెన్నై), దామిని అగర్వాల్ (కోల్‌కతా), పిరీష్ ధర్ (ముంబై)లు ఉన్నారని తెలిపారు.