సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2019 (15:19 IST)

మార్పు యువతతోనే సాధ్యం... శాంతిదూత కైలాష్ సత్యర్థి

మార్పు అనేతి యువతతోనే సాధ్యమవుతుందని శాంతి విభాగంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న ప్రముఖ సంఘ సేవకుడు కైలాష్ సత్యర్థి అన్నారు. యువత తలచుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ దేశంలో అనేక కోట్ల మంది చిన్నారులు బానిసత్వంలో (బాల కార్మికులు) మగ్గిపోతున్నారనీ, వారికి కొత్త జీవితం ప్రసాదించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ విషయంలో తనవంతు కృషి తాను చేస్తున్నానని, ఫలితంగా కొన్ని వేల మంది చిన్నారులు ఇపుడు కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పుకొచ్చారు. 
 
చెన్నైలోని ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎమ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎమ్ ట్రస్ట్.. చైల్డ్ రైట్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తద్వారా దేశంలోనే మొట్టమొదటి చైల్డ్ కేర్ కేంద్రం ఎస్ఆర్ఎమ్‌లో ఏర్పాటైంది. దేశంలో తొలిసారిగా డాక్టర్ కైలాష్ సత్యార్థి ట్రస్ట్‌తో సంయుక్తంగా ఎస్ఆర్ఎమ్ టెక్నాలజీ సెంటర్ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు, చైల్డ్ రైట్స్ సెంటర్ చీఫ్ డాక్టర్ సత్యనారాయణన్ తెలిపారు. 
 
శాంతి విభాగంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన డాక్టర్ కైలాష్ సత్యర్థి.. భారత్, బంగ్లాదేశ్, మియాన్మార్‌లతో పాటు పలు దేశాల్లో బాధితులైన 83వేల మంది చిన్నారులకు విద్య, పునరావాసం కల్పించి వారి అవసరాలను తీర్చుతున్నారు. ఆయన సృష్టించిన కమ్యూనిటీ వ్యక్తిగత హక్కుల నెట్‌వర్క్ ద్వారా బాల కార్మికులను నిర్మూలించడం, చిన్నారులకు వ్యతిరేకంగా జరిగే అకృత్యాలను నిరోధించడం వంటివి జరుగుతున్నాయి.
 
భవిష్యత్తులో మార్పును తెచ్చే విద్యార్థులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. బానిసత్వం నుంచి విముక్తి పొందేందుకు విద్య ఉపయోగపడుతుందన్నారు. వేలాది సంవత్సరాలకుపైగా బానిసత్వం వుంటూ వస్తోందన్నారు. ఇందుకు సరైన పరిష్కారం సైన్స్ అండ్ టెక్నాలజీ చూపుతుందని కైలాష్ సత్యర్థి చెప్పుకొచ్చారు.
 
బాల కార్మికులను పట్టించుకునే పరిస్థితి ప్రస్తుతం కనబడట్లేదన్నారు. అందుకే తాను 'బాల కార్మికుల నిర్మూలనకు నడుం బిగించాను. 152 మిలియన్ల చిన్నారులకు మరుగుదొడ్లు లేని దుస్థితి. అలాగే 262 మిలియన్ల చిన్నారులకు విద్యా సౌకర్యం లేని పరిస్థితి. రోజుకు వంద మంది మహిళలు కిడ్నాప్ అవుతున్న దుస్థితి కొనసాగుతోంది. దీన్ని అరికట్టాలంటే 103 ప్రపంచ దేశాల్లో ర్యాలీ నిర్వహించి.. దాని సహాయంతో 80 వేల మంది చిన్నారులకు విద్యకు సంబంధించిన ఏర్పాట్లు కల్పించినట్టు' తెలిపారు.
 
బాలకార్మికులను నిర్మూలించేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ర్యాలీ నిర్వహించినట్టు చెప్పారు. ఇందులో ప్రముఖులు, 169 ఎంపీలు పాల్గొంటారు. ఇందులోభాగంగానే 1986లో బాలకార్మికులను నిరోధించే చట్టం అమలులోకి వచ్చింది. మార్పు అనేది యువత చేతుల్లోనే వుంది. మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన కొత్త టెక్నాలజీని ఇంజినీరింగ్ విద్యార్థుల కనుగొనాలని పిలుపు నిచ్చారు. దేశంలో ఎస్ఆర్ఎమ్ సంస్థ మార్పు కోసం చేసే ప్రయత్నాల్లో తన కాలేజీ విద్యార్థులను రంగంలోకి దించిందని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఎస్ఆర్ఎమ్ అధ్యక్షుడు డాక్టర్ పి. సత్యనారాయణ అధ్యక్ష వహించారు.