సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 అక్టోబరు 2020 (10:22 IST)

ప్రపంచంలో 4 కోట్ల మందికి కరోనా... మళ్లీ లాక్డౌన్??

కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రజలను వణికిస్తోంది. ఈ వైరస్ వెలుగు చూసి ఒక యేడాది కావొస్తున్నా.. ఇప్పటివరకు అదుపుచేయలేని పరిస్థితి. దీనికి కారణం... సరైనా టీకా లేకపోవడమే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నాలుగు కోట్ల మంది ఈ వైరస్ బారినపడినట్టు సమాచారం. 
 
ఒక్క అమెరికాలోనే 80 లక్షలు, భారత్‌లో 75 లక్షల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అలాగే, రోజురోజుకు నమోదవుతున్న కరోనా కేసులు రికార్టులు సృష్టిస్తున్నాయి. యూరప్, ఇటలీ, జర్మనీ దేశాలు మొదలుకొని పోర్చుగల్ వరకూ కరోనా కేసులు రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో కొన్నిదేశాలు మరోమారు లాక్డౌన్ విధించే దిశగా ఆలోచిస్తున్నాయి. లండన్‌లో ఉంటున్నవారు ఇతరులను తమ ఇళ్లకు రానివ్వడం లేదు. అలాగే ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌తో పాటు మరో 8 నగరాలకు చెందిన ప్రజలు నాలుగు వారాల పాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ తమ ఇళ్లలోనే ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. బెల్జియంలో నాలుగువారాల పాటు రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించారు. 
 
ఇదిలావుంటే, భారత్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 61,871 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,94,552 కి చేరింది.
 
గ‌త 24 గంట‌ల సమయంలో 1,033 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,14,031 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 65,97,210 మంది కోలుకున్నారు. 7,83,311 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 9,42,24,190 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,70,173 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.