శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మే 2020 (18:45 IST)

చెన్నైలో ఒకే వీధిలో 42 మందికి కరోనా - నిర్బంధంలో వనస్థలిపురం

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా, రాష్ట్రంలోని ఇతర జిల్లాలలతో పోల్చితే చెన్నైలో జిల్లాలో మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఫలితంగా ఒక్క చెన్నై నగరంలోనే సుమారు 1300 వరకు కేసులు నమోదయ్యాయి. దీంతో చెన్నై వాసులు వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నైలోని ట్రిప్లికేణిలో ఉన్న వీఆర్ పిళ్లై వీధిలో కేవలం నాలుగు రోజుల్లో ఏకంగా 42 మందికి ఈ వైరస్ సోకింది. ఈ వీధిలోని పలువురికి ఓ వలంటీరు ఆహారాన్ని సరఫరా చేశాడు. ఈ కారణంగానే వైరస్ సోకినట్టు చెన్నై కార్పొరేషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత ఈ వీధిని దిగ్బంధించిన అధికారులు.. క్లోరినేషన్ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రాంతం తొమ్మిదో జోన్ అయిన తేనాంపేట పరిధిలోకి వస్తుంది. ఈ జోనులో ప్రస్తుతం మొత్తం 145 కరోనా కేసులు ఉండగా, వీరిలో 24 మంది కోలుకున్నారు. మరో 121 యాక్టివ్ కేసులుగా ఉన్నాయి. కాగా చెన్నై జిల్లాలో ప్రస్తుతం 1275 కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో కూడా కరోనా వైరస్ తీవ్రంగా ఉంది. దీంతో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. వనస్థలిపురంలోని 8 కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఈ కంటైన్మెంట్ జోన్లలో సోమవారం నుంచి వారం రోజుల పాటు రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఈ జోన్ల పరిధిలోని నివాసాల పరిసరాల్లో కఠిన ఆంక్షలు విధించారు.
 
వనస్థలిపురంలోని హుడా సాయినగర్, సుష్మా సాయినగర్, కమలానగర్, రైతుబజార్ సమీపంలోని ఏ, బీ టైప్ కాలనీలు, ఫేజ్-1 కాలనీ, సచివాలయనగర్, ఎస్కేడీ నగర్ లతో పాటు రైతు బజార్-సాహెబ్ నగర్ రహదారిని కూడా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
 
వనస్థలిపురం పరిధిలో మూడు కుటుంబాలు కరోనా బారినపడడంతో ఈ చర్యలు తీసుకున్నారు. వనస్థలిపురం ప్రాంతంలో ఇప్పటివరకు 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వనస్థలిపురం పరిధిలో 169 కుటుంబాలు హోం క్వారంటైన్‌లో ఉన్నాయి.