శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (11:12 IST)

కర్నూలును భయపెడుతున్న కరోనా... పెరిగిపోతున్న కేసులు... ప్రజల్లో భయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాను కరోనా వైరస్ భయపెడుతోంది. ఈ జిల్లాలో ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయానికి మరో ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ జిల్లాలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 82కు చేరగా, ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 386కు చేరింది. కర్నూలు తర్వాత గుంటూరు 58 కేసులతో రెండో స్థానంలో ఉంది. 
 
కొత్త‌గా న‌మోదైన ఐదు కేసులు కూడా ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారివేన‌ని అధికారులు తెలిపారు. జిల్లాలో కేసుల సంఖ్య క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతుండ‌టంతో లాక్‌డౌన్‌ను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇదిలావుంటే ఏపీలో శుక్రవారం కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 
 
శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య గుంటూరులో ఏడు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో రెండు చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరగా.. కర్నూలులో తాజా కేసులతో కలిపి ఆ సంఖ్య 386కు పెరిగింది.