బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (12:32 IST)

వంద సంఖ్యకు దిగువకు చేరుకున్న కరోనా మరణాలు

దేశంలో కరోనా మరణాల సంఖ్య బాగా తగ్గిపోయింది. మంగళవారం లెక్కల ప్రకారం ఈ వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య కేవలం 94 మాత్రమే. ఇది భారత్ పెద్ద ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
అలాగే రోజువారీ కేసుల 10వేలలోపునకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 94 మరణాల సంభవించగా.. 8,635 కొత్త కేసులు వెలుగుచూశాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. 
 
దీంతో ఇప్పటివరకు 1,07,66,245 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1,54,486కి చేరింది. ఎనిమిది నెలల తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదకావడం ఇదే తొలిసారి. 
 
ఇకపోతే, కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి శాతం 97కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 13,423 మంది కరోనా నుంచి కోలుకోగా.. కోటీ నాలుగు లక్షల మందికి పైగా వైరస్‌ను జయించారు. 
 
ఎప్పటిలాగే క్రియాశీల కేసుల్లో క్షీణత కొనసాగింది. దేశంలో 1,63,353 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 1.56 శాతానికి తగ్గింది. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం.. నిన్న వైద్య సిబ్బంది 6,59,422 మంది నమూనాలను పరీక్షించారు.  
 
ఇంకోవైపు, జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 1 వరకు 39,50,156 మందికి టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న 1,91,313 మంది టీకా వేయించుకున్నారు.