'కరోనా'కు మరణం లేదు : 'వైరస్'తో కలిసి జీవించడం నేర్చుకోండి.. డబ్ల్యూహెచ్ఓ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) బాంబు పేల్చింది. ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో అంతం కాదని తేల్చి చెప్పింది. పైగా, ఈ వైరస్‌తో కలిసి జీవించేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది. అంటే, కరోనా వైరస్ శాశ్వతంగా కాదని, అందువల్ల దాంతో కలిసి జీవనం చేసేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధులు కావాలని చెప్పకనే చెప్పినట్టయింది.
చైనాలోని వుహాన్ నగరంలో పురుడు పోసుకున్న ఈ వైరస్ తొలి కేసు 2019, డిసెంబరులో వెలుగు చూసింది. అప్పటి నుంచి ఈ వైరస్ చాపకింద నీరులా ప్రపంచం మొత్తం విస్తరించింది. ఫలితంగా దాదాపు 250 దేశాలకు పైగా ఈ వైరస్ వ్యాపించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 4.35 మిలియన్ కేసులు ఉండగా, 297 వేల మంది చనిపోయారు. అగ్రరాజ్యం అమెరికాను ఈ వైరస్ ఓ ఆట ఆడుకుంటోంది.
ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. నోవెల్ కరోనా వైరస్ ఎక్కడికీ వెళ్లదనీ, దాంతో కలిసి జీవించడం మనుషులు నేర్చుకోవాలని సూచన చేసింది. వ్యాప్తంగా కొన్ని దేశాలు స్వల్పంగా లాక్‌డౌన్ ఎత్తివేస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ఈ విధంగా రియాక్ట్ అయ్యింది.
ప్రపంచ జనాభాలోకి కొత్తగా వైరస్ ప్రవేశించిందని, అయితే ఎప్పుడు ఆ వైరస్‌ను జయిస్తామన్న విషయాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ డైరక్టర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు. ఈ వైరస్ మన జీవితాల్లో భాగస్వామ్యం అవుతుందని, ఇక వైరస్ ఇప్పట్లో వెళ్లే సూచనలు కనిపించడం లేదన్నారు.
హెచ్ఐవీ ఇంకా వెళ్లిపోలేదని, కానీ ఆ వైరస్‌తో జీవించడం నేర్చుకున్నామన్నారు. కరోనా వైరస్‌తో ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల సుమారు సగం ప్రపంచ జనాభా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఈ వైరస్ వ్యాప్తిని మాత్రం కట్టడి చేయలేకపోతున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తున్న దేశాలన్నీ జాగ్రత్తగా వ్యవహరించాలని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ హెచ్చరిస్తున్న విషయం తెల్సిందే.