మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (19:38 IST)

కర్నూలులో కరోనా కలకలం ... ఏపీలో 303కి చేరిన పాజిటివ్ కేసులు

ఆరంభంలో అదుపులో ఉన్నట్టు భావించిన కరోనా వైరస్ ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భయపెడుతుంది. ముఖ్యంగా, కర్నూలు జిల్లాలో మరింతగా కలకలం రేపుతోంది. మర్కజ్ మత సమ్మేళనం తర్వాత ఆంధ్రాలో ఒక్కసారిగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే.
 
ఆంధ్రాలో సోమవారం ఉదయం 266గా ఉన్న ఈ కేసుల సంఖ్య సాయంత్రం 6 గంటలకు మరో 37 కేసులు పెరిగి.. 303కు చేరుకున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో ముగ్గురు మరణించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి. 
 
అటు, కర్నూలు జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతోంది. అక్కడ మరో 18 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో కర్నూలు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74కి చేరింది. నెల్లూరు జిల్లాలోనూ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇవాళ కొత్తగా 8 పాజిటివ్ కేసులను గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 42 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
 
సోమవారం కొత్తగా నమోదైన కేసులను జిల్లాల వారీగా పరిశీలిస్తే, కర్నూలులో 18, నెల్లూరు 8, పశ్చిమ గోదావరి 5, కడప 4, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్క పాజిటివ్‌ కేసు చొప్పున నమోదైంది. మరోవైపు ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకుని ఆరుగురు డిశ్చార్‌ అయ్యారు. ఇక మొత్తం జిల్లాల వారిగా చూస్తే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అత్యధికంగా కర్నూలు 74లో నమోదు అయ్యాయి.
 
ఆయా జిల్లాల్లో ఇప్పటివరకు నమోదైన కేసులను పరిశీలిస్తే, నెల్లూరులో 42, గుంటూరు 32, కృష్ణా 29, కడప 27, ప్రకాశం 24, పశ్చిమ గోదావరి 21, విశాఖపట్నం 20, చిత్తూరు 17, తూర్పుగోదావరి 11, అనంతపురం 6 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఓ ‍ప్రకటన విడుదల చేసింది. 
 
ఇక కరోనా నిర్ధారణ పరీక్షల కోసం విశాఖపట్నంలో వైరల్‌ ల్యాబ్‌ అందుబాటులోకి వచ్చింది. రూ.కోటి 25 లక్షలతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో వైరస్‌ నిర్ధారణకు 6 గంటల సమయం పట్టనుంది. విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ వైరల్‌ ల్యాబ్‌ అందుబాటులోకి రానుంది.