1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (21:52 IST)

వామ్మో తెలంగాణాలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి జోరందుకుంది. దీనికి నిదర్శనమే గత 24 గంటల్లో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా వెయ్యి దాటిపోయింది. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్ మేరకు గత 24 గంటల్లో 42991 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 1052 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 659 కొత్త కేసులు ఉండటం గమనార్హం. వీటిలో కూడా మల్కాజిగిరి జిల్లాలో 116, రంగారెడ్డి జిల్లాలో 109 కేసులు ఉన్నాయి. 
 
అదేసమయంలో 240 మందికి కరోనా వైరస్ నుంచి కోలుకోగా ఇద్దరు మరణించారు. తాజాగా మరణాలతో కలుకుంటే ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 4033కు చేరింది. అలాగే, రాష్ట్రంలో మొత్తం 6,84,023 పాజిటివ్ కేసులు నమోదుకాగా వీరిలో 6,75,132 మంది కోలుకున్నారు. 
 
ఏపీలో 334 పాజిటివ్ కేసులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా మరో 334 కరోనా కేసులు నమోదుకాగా, ఒక్క రోగి మృత్యువాతపడ్డారు. మంగళవారం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ శాఖ వెల్లడించిన బులిటెన్ మేరకు... కొత్తగా నమోదైన 334 పాజిటివ్ కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,77,942కు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 14,499కు పెరిగింది. 
 
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1516 యాక్టివ్ కేసులు ఉండగా వీరంతా ఆయా ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 95మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి కోలుకున్న వారి సంఖ్య 20,61,927కు చేరుకుంది.