ఢిల్లీకి పొంచివున్న కరోనా థర్డ్ వేవ్ ముప్పు!
దేశరాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, థర్డ్ వేవ్‌పై ఐఐటి ఢిల్లీ విడుదల చేసిన నివేదిక భయాందోళనలు కలిగించేలా ఉంది. ఆ రిపోర్టు ప్రకారం కరోనా థర్డ్ వేవ్‌లో ఢిల్లీలో సగటున రోజుకు 45 వేలకుపైగా కేసులు నమోదవుతాయని అంచనా.
అలాగే ప్రతిరోజూ సుమారు తొమ్మిది వేల మంది ఆసుపత్రిలో చేరే అవకాశాలున్నాయి.
ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని దానిలో సూచించారు. ఈ నివేదిక ప్రకారం అటువంటి పరిస్థితి తలెత్తితే నగరానికి ప్రతిరోజూ 944 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని అంచనా.
ఈ సూచనల నేపథ్యంలో ఢిల్లీలో థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. ఆక్సిజన్ కొరత లేకుండా చూడటానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజధానిలో ఆక్సిజన్ సరఫరా, నిర్వహణపై ఐఐటి ఢిల్లీ... కేజ్రీవాల్ సర్కారు కలిసి పనిచేస్తున్నాయి.
ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాల వ్యూహాత్మక సమస్యలను విశ్లేషించడం ద్వారా రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ఆక్సిజన్ పంపిణీపై ఐఐటి ఢిల్లీ తయారు చేసిన బ్లూప్రింట్‌ను అమలు చేయడానికి సూచించిన చర్యలు ఎప్పుడు అమలు చేస్తారో వివరించాలని గతంలో హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకోసం కోర్టు... ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది.