బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (10:32 IST)

ఫరూక్ అబ్దుల్లా కరోనా పాజిటివ్.. దేశంలో 271 మంది మృత్యువాత

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ ప్రెసిడెంట్‌, జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించారు. 
 
వైరస్‌కు పాటివ్‌గా పరీక్షించారని, కొన్ని లక్షణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర కుటుంబీకులతో కలిసి క్వారంటైన్‌లో తాను సైతం సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటానని తెలిపారు. ఇటీవల తమను కలిసిన వారంతా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
 
మరోవైపు దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 56,211 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,20,95,855కు పెరిగింది. 
 
వైరస్‌ ప్రభావంతో 24 గంటల్లో 271 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,62,114కు చేరింది. తాజాగా 27,028 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,13,93,021 మంది కోలుకున్నారు.