ఈశాన్య భారతంలోకి అడుగుపెట్టిన కరోనా.. మణిపూర్‌లో తొలికేసు
ఈశాన్య భారతంలోకి కరోనా వైరస్ అడుగుపెట్టింది. ఫలితంగా మణిపూర్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. మణిపూర్‌కు చెందిన ఓ యువతి.. ఇటీవలే బ్రిటన్ నుంచి వచ్చింది. ఆ అమ్మాయికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు.
యువతి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచారు. కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ యువతి యూకేలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది. ఇక ఇప్పటి వరకు భారత్‌లో 470 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిది మంది మరణించారు.
మరోవైపు, దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 500 దాటింది. కర్ణాటకలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తంగా 37 మంది వైరస్ బారిన పడ్డారు. మరోవైపు మహారాష్ట్ర అత్యధికంగా ప్రభావితం అవుతోంది. దేశంలోనే అత్యధికంగా ఆ రాష్ట్రంలో 97 మందికి వైరస్ సోకింది. సోమవారం ఒక్క రోజే 23 కొత్త కేసులు వచ్చాయి. కేరళ 95 కేసులతో రెండో స్థానంలో ఉంది.