మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (11:41 IST)

నేపాల్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. భారత టూరిస్టులపై నిషేధం

covid19
మిత్రదేశాల్లో ఒకటైన నేపాల్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే ఏకంగా 1090 కరోనా కేసులు నమోదమయ్యాయి. అదేసమయంలో నేపాల్ వెళ్లిన భారత పర్యాటకుల్లో నలుగురికి ఈ వైరస్ ఉన్నట్టు నిర్థారణ అయింది. దీంతో భారత పర్యాటకులపై నేపాల్ నిషేధం విధించింది. 
 
నేపాల్‌లో కరోనా సోకిన భారత పర్యాటకులు ఝులాఘాట్ సరిహద్దు ప్రాంతం మీదుగా నేపాల్‌లోని బైతాడీ జిల్లాలోకి ప్రవేశించినట్టు ఖాట్మండు అధికారులు నిర్ధారించారు. అలాగే, వివిధ పనుల మీద భారత్‌కు వచ్చి తిరిగి నేపాల్‌కు వెళ్లిన పర్యాటకులు కూడా ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో నేపాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
మరోవైపు, టిబెట్‌లో కేసులు పెరుగుతుండటంతో టిబెట్ బౌద్ధ నేతల సంప్రదాయ గృహమైన పోటాలా సౌధాన్ని చైనా మంగళవారం నుంచి తాత్కాలికంగా మూసివేశింది. మరోవైపు, చైనాలో మంగళవారం 828 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడగా, నేపాల్‌లో 1090 కరోనా కేసులు వెలుగు చూశాయి.