బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2020 (21:06 IST)

ఇండియాలో మరో 1813 కరోనా కేసులు.. పెరు జైలులో ఖైదీలకు పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. బుధవారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా కొత్తగా 1813 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుని దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,787కు చేరింది. 
 
అలాగే, గత 24 గంటల్లో కరోనా వైరస్ దెబ్బకు 71 మంది ప్రాణాలు కోల్పోగా, ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 1008కు చేరింది. అలాగే, 7797 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 22,982 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
 
మరోవైరు, పెరూ దేశంలోని ఓ జైలులో ఉండే ఖైదీల్లో 600 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో జైల్లో కలకలం చెలరేగింది. ఈ విషయం తెలియగానే తమను జైలు విడుదల చేయాలంటూ ఖైదీలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో తొమ్మిది మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో జైలు అధికారులు, సిబ్బంది గాయపడ్డారు. 
 
తాజాగా పెరూలోని మైగుల్ క్యాస్ట్రో-క్యాస్ట్రో జైలులోని ఖైదీలకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 600 మంది ఖైదీలకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో జైలులో ఒక్కసారిగా కలకలం రేగింది. తమను విడుదల చేయాలంటూ ఖైదీలందరూ కలిసి ఆందోళనకు దిగారు.
 
ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలకు పూనుకున్నారు. చాలామంది ఖైదీలు జైలు గోడలు ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించగా, మరికొందరు జైలు సిబ్బందిపై దాడికి యత్నించారు. మంచాలు తగలబెట్టారు. వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన 60 మంది జైలు సిబ్బంది, ఐదుగురు పోలీసులు, ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు.