గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: సోమవారం, 12 ఏప్రియల్ 2021 (17:59 IST)

వరంగల్: రెండు సార్లు టీకా వేసుకున్నా వదిలిపెట్టని కరోనావైరస్, ఎంతమందిని పట్టుకుందో తెలుసా?

రెండుసార్లు టీకా తీసుకున్న వారినీ కొవిడ్‌ వదలడం లేదు. వరంగల్‌లో ఇలాంటి కేసులు ఇటీవల వెలుగుచూస్తున్నాయి. వరంగల్‌ సీకేఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మసిస్టు రెండు విడతలు టీకా తీసుకున్నా మళ్లీ కరోనా బారిన పడ్డారు. కీర్తినగర్‌ యూపీహెచ్‌సీల్లో నాలుగు రోజుల కిందట 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

అందులో రెండోవిడత టీకా తీసుకున్న ఏడుగురికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు తెలిసింది. కొత్త విషయమేమిటంటే టీకా తీసుకున్నవారికి కొవిడ్‌ పాజిటివ్‌ వస్తే అధికారులు పాజిటివ్‌ రిపోర్టు చేతికి ఇవ్వడం లేదు. చరవాణికి సంక్షిప్త సందేశాన్నీ పంపడం లేదు. ఆరా తీస్తే వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి పాజిటివ్‌ వస్తే పోర్టల్‌లో తీసుకోవడం లేదని సిబ్బంది అంటున్నట్లు బాధితులు తెలిపారు.

పాజిటివ్‌ రిపోర్టు ఇస్తేనే అధికారులు సెలవు మంజూరు చేస్తామంటున్నారని వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై వరంగల్‌ అర్బన్‌ జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్‌ లలితాదేవి మాట్లాడుతూ.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నా జాగ్రత్తలు పాటించాల్సిందేనన్నారు. టీకా వేయించుకుంటే వంద శాతం వైరస్‌ సోకదని చెప్పలేమన్నారు.