శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (09:28 IST)

కాన్పూర్‌లో వెలుగు చూసి జికా వైరస్

మన దేశంలో కేరళ, మహారాష్ట్రలో జికా వైరస్ గుర్తించారు. ఇపుడు తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌ జిల్లాలో జికా వైరస్ వెలుగు చూసింది. ఈ జిల్లాలోని పోఖాపూర్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఒకరికి ఈ వైరస్ సోకినట్టు అధికారులు వెల్లడించారు. 
 
పేషెంట్స్ శాంపుల్స్ పరీక్షల కోసం పుణె పంపగా, నివేదికలో పాజిటివ్ అని తేలిందని, దీంతో ఆ ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ శానిటైజ్ చేసిందని చెప్పారు. పేషెంట్‌తో సన్నిహత సంబంధాలున్న 200 మందిని ఐసొలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు కాన్పూర్ చీఫ్ మెడికల్ అధికారి నేపాల్ సింగ్ తెలిపారు. 
 
జికా వైరస్ సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్లు చర్మం ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2-7 రోజుల పాటు ఇవి కొనసాగితే, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. 
 
ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించొచ్చు. సెక్యువల్ ఇంటర్‌కోర్స్ ద్వారా కూడా వ్యాధి వ్యాపించవచ్చు. గర్భిణుల నుంచి పుట్టబోయే బిడ్డకూ ఇది సంక్రమించవచ్చు. దానివల్ల పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. గర్భస్రావం జరిగే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.