ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్ : బరిలో దిగే భారత జట్టు ఇదే
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇప్పటికే వన్డే, ట్వంటీ20 సిరీస్‌లు ముగిశాయి. వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటే, ట్వంటీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఈ టూర్‌లో భాగంగా గురువారం అంటే డిసెంబరు 17వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇది డే అండ్ నైట్‌లో జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం పింక్ బంతిని ఉపయోగిస్తారు. ఈ మ్యాచ్‌లో ఆడే 11 మంది ఆటగాళ్ళ పేర్లను టీమిండియా యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో బీసీసీఐ ఓ ట్వీట్ చేసింది.
తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, పృథ్వి షా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక టీమ్‌లో ఏకైక స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఉంటాడు. ముగ్గురు పేస్‌బౌలర్లు ఉమేష్ యాదవ్, మహ్మద్ షమి, జస్‌ప్రీత్ బుమ్రాలకు కూడా తుది జట్టులో చోటుదక్కింది.
ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్‌ను కాదని వికెట్ కీపింగ్ బాధ్యతలు వృద్ధిమాన్ సాహుకు అప్పగించారు. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో పుజారా, కోహ్లీ, రహానే ఆడనున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో టెస్ట్ అరంగేట్రం కోసం అతను మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
ఇదిలావుండగా, ఇరు జట్లనూ ఓపెనర్ల సమస్య వేధిస్తోంది. ఇరు జట్ల ఫ్రంట్ లైన్ ఓపెనర్లు ఇప్పటికే గాయాల బారిన పడి, తొలి టెస్టుకు దూరం కాగా, ఆడిలైడ్ వేదికగా, జరిగే తొలి టెస్టులో రెండు జట్లూ కొత్త ఓపెనర్లను పరిచయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పింక్ బాల్‌తో ఆడే మ్యాచ్‌ల్లో ఆరంభంలో బాల్ గట్టిగా ఉన్న సమయంలో బ్యాట్స్ మెన్లకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. సాంకేతికంగా, మానసికంగా బలంగా ఉన్న ఆటగాళ్లే క్రీజులో నిలవగలుగుతారని ఇప్పటికే పలు మ్యాచ్ లలో నిరూపితమైంది.
బాల్ కనిపించగానే బౌండరీకి తరలించాలని భావించే వారు ఆదిలోనే బోల్తా కొట్టక తప్పదని మ్యాచ్ విశ్లేషకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇరు జట్లూ ఇన్నింగ్స్ ప్రారంభించే ఆటగాళ్లపై దృష్టిని సారించాయి. ఇక ఇదే మ్యాచ్‌లో చీకటి పడిన తర్వాత ఎదురయ్యే పరిస్థితులపైనా కెప్టెన్లు ప్రత్యేక దృష్టిని సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆస్ట్రేలియా విషయానికి వస్తే, డేవిడ్ వార్నర్, విల్ పుకోవ్ స్కీలు ఇప్పటికే గాయాల బారిన పడ్డారు. మరో ఓపెనర్ జోయ్ బుర్న్స్ తానాడిన గత 9 మ్యాచ్‌లలో కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు. మార్కస్ హారిస్ సైతం ఇటీవల తన ఫామ్‌ను కోల్పోయాడు.
దీంతో ఓపెనింగ్ ఆటగాళ్ల సమస్య ఆసీస్‌నూ బాధిస్తోంది. మార్నస్ లబుస్ చేంజ్‌కి ఓపెనర్‌గా ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో మ్యాథ్యూ వేడ్‌తో కలిసి హారిస్ కూడా ఆటను ప్రారంభించవచ్చని, ఏదైనా తుది నిర్ణయం తీసుకోవడం కొంత కష్టమేనని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు.