నాలుగో టెస్ట్: పట్టు బిగించిన టీమిండియా - 89 రన్స్ లీడింగ్
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పట్టుబిగించింది. రిషబ్ పంత్(101) సెంచరీతోపాటు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (60 నాటౌట్) హాఫ్ సెంచరీ చేయడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్లకు 294 పరుగులు చేసింది.
దీంతో ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి సేన 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో సుందర్‌తోపాటు అక్షర్ పటేల్ (11) ఉన్నాడు. పంత్ ఔటైన తర్వాత కూడా ఈ ఇద్దరూ ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఎనిమిదో వికెట్‌కు ఇప్పటికే 35 పరుగులు జోడించారు.
అంతకుముందు మిడిలార్డర్ విఫలమవడంతో ఒక దశలో టీమిండియా 146 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ముఖ్యంగా, కెప్టెన్ కోహ్లి (0)తోపాటు రహానే (27), అశ్విన్ (13), పుజారా (17)లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యారు. రోహిత్ 49 పరుగులు చేసి ఔటయ్యాడు.
అస్సలు ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో చేసిన స్కోరును అధికమిస్తుందా లేదా అన్న సందేహం కూడా కలిగింది. కానీ, రిషబ్ పంత్, సుందర్‌లు అద్భుతంగా ఆడి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 113 పరుగులు జోడించి కీలకమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారు. ఈ క్రమంలో పంత్ టెస్టుల్లో మూడో సెంచరీ చేయగా.. సుందర్ మూడో హాఫ్ సెంచరీ చేశాడు.
అంతకుముందు ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులు చేసిన విషయం తెల్సిందే. ఆ జట్టులో బెన్ స్టోక్స్ 55 పరుగులు, డాన్ లారెన్స్ 46, జానీ బెయిర్‌స్టో 28, ఒల్లీపోప్ 29 రన్స్ చొప్పున పరుగులు చేశారు.