శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (17:19 IST)

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో వరుస రికార్డులు

స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో భారత్ టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతడు 49 పరుగులు చేసి స్టోక్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 
 
ఈ క్రమంలోనే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఓపెనర్ల జాబితాలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్‌ తర్వాత డేవిడ్‌ వార్నర్‌(948), డీన్‌ ఎల్గర్‌(848) ఉన్నారు. అలాగే టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఆసియా ఆటగాడిగానూ హిట్‌మ్యాన్‌ రికార్డు నెలకొల్పాడు. 
 
మరోవైపు ఉప సారథి అజింక్య రహానె (1,068) సైతం ఈ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన మరో భారత ఆటగాడిగా నిలిచాడు. ఇక మార్నస లబుషేన్‌(1,675), జోరూట్‌(1,630), స్టీవ్‌స్మిత్‌(1,341), బెన్‌స్టోక్స్‌ (1,301) మాత్రమే టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ కన్నా ముందున్నారు.
 
ఇదే ఇన్నింగ్స్‌తో రోహిత్‌.. మయాంక్‌ అగర్వాల్‌ పేరిట ఉన్న మరో రికార్డును తిరగరాశాడు. టెస్టుల్లో 17 ఇన్నింగ్స్‌ల్లోనే వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఆసియా ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇదివరకు మయాంక్‌ 19 ఇన్నింగ్స్‌ల్లో ఆ ఘనత సాధించాడు. ఇక టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో వేగవంతంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గానూ ఇంకో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో వినోద్‌ కాంబ్లీ 14 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డు నమోదు చేశాడు. పుజారా 18 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు.
 
మరోవైపు టెస్టుల్లో ఆల్‌టైమ్‌ ఓపెనర్లలో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గానూ రోహిత్‌ శర్మ మరో ఘనత సాధించాడు. దాంతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌స్మిత్‌ సరసన చేరాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్‌ మాజీ ఓపెనర్లు హర్బర్ట్‌ సక్లిఫ్‌ 13 ఇన్నింగ్స్‌, లెన్‌ హుట్టన్‌ 16 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచారు.