గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (13:56 IST)

బాబర్‌ ఆజాం రికార్డ్: హ్యాట్రిక్ సెంచరీలతో కోహ్లీ రికార్డ్ బ్రేక్

babar azam
వన్డే క్రికెట్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం చరిత్ర సృష్టించాడు. కెప్టెన్ బాబర్ అజామ్ (103) సెంచరీతో రాణించి, ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన పాకిస్థాన్ కెప్టెన్‌గా వన్డేల్లో 1000కు పైగా పరుగుల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు బాబర్. తద్వారా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (17 ఇన్నింగ్స్‌లు) రికార్డును బద్దలు కొట్టాడు.
 
ఇకపోతే.. సెంచరీతో హ్యాట్రిక్ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ముల్తాన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో బాబర్‌ సెంచరీతో అదరగొట్టాడు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో రెండుసార్లు వరుసగా హ్యాట్రిక్‌ సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా బాబర్‌ ఆజాం రికార్డులకెక్కాడు. 
 
ఈ ఏడాదిలో వన్డేల్లో బాబర్‌కు ఇది వరుసగా మూడో సెంచరీ కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అఖరి రెండు మ్యాచ్‌ల్లో బాబర్‌ వరుసగా సెంచరీలు సాధించాడు.
 
ఆసీస్‌తో వన్డే సిరీస్‌ తర్వాత స్వదేశంలో విండీస్‌తో పాక్‌ తలపడుతోంది. విండీస్‌తో ఆడిన తొలి వన్డేలోనే బాబర్‌ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
ఇక 2016లో యూఏఈ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి సారిగా బాబర్‌ వరుసగా మూడు సెంచరీలు సాధించాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ముల్తాన్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్‌పై పాక్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.