రికార్డులపై రికార్డులు సృష్టించే కోహ్లీతో నాకు పోలికా?
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ యువ క్రికెట్ సంచలనం బాబర్ ఆజం సంచలన వ్యాఖ్యలు చేశారు. పరుగుల దాహం తీర్చుకుంటూ రికార్డులపై రికార్డులు సృష్టిస్తున్న కోహ్లీతో తనను పోల్చవద్దని బాబర్ ఆజం విజ్ఞప్తి చేశారు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఆజం కీలక క్రికెటర్‌గా మారాడు. ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. దీంతో మరో విరాట్ కోహ్లీ అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై ఆయన బాబర్ స్పందిస్తూ, సమకాలీన క్రికెట్‌లో విరాట్ కోహ్లియే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
ఎందుకంటే.. ఏ ఫార్మాట్‌లో అయినా కోహ్లీ గణాంకాలకు దగ్గరగా ఉన్న ప్లేయరే లేడని గుర్తుచేశాడు. అలాంటి గొప్ప క్రికెటర్‌తో తనను పోల్చవద్దన్నాడు. 'నన్ను తరచూ కోహ్లితో పోలుస్తుంటారు. కానీ అతడు చాలా గొప్ప ప్లేయర్. అతనికి దరిదాపుల్లో కూడా నేను లేను. నేనిప్పుడే నా కెరీర్‌ను ప్రారంభించాను. అతడు ఇప్పటికే చాలా సాధించేశాడు. అతనిలాగే నేను ఆడగలిగితే ఏదో ఒక రోజు కోహ్లీ సాధించిన రికార్డులను సాధించాలని అనుకుంటున్నాను. అప్పుడు నన్ను అతనితో పోల్చండి కానీ ఇప్పుడు వద్దు' అని బాబర్ అన్నాడు.
కాగా, వీరిద్దరి వన్డే కెరీర్‌ను విశ్లేషిస్తే... తొలి 59 వన్డేల్లో ఈ ఇద్దరి ఆటతీరు ఇలా ఉంది. తొలి 59 వన్డే మ్యాచ్‌లలో కోహ్లీ 56 ఇన్నింగ్స్‌లలో ఏడు సార్లు నాటౌట్‌గా నిలిస్తే బాబర్ 9 సార్లు నాటౌట్‌గా నిలిచారు. కోహ్లీ 2153 పరుగులు చేస్తే బాబర్ 2462 పరుగులు చేయగా, కోహ్లీ సగటు 43.9 కాగా, బాబర్ సగటు 51.3గా ఉంది. అలాగే, కోహ్లీ 85.3 స్ట్రైక్ రేటుతో 5 సెంచరీలు, 15 అర్థ సెంచరీలు చేస్తే బాబర్ మాత్రం 84.6 స్ట్రైక్ రేటుతో 8 సెంచరీలు 10 అర్థ సెంచరీలు బాదాడు.