అక్టోబరులో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : పాక్ ఆటగాళ్లకు వీసాలు లభించేనా?
వచ్చే అక్టోబరు నెలలో ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, ఈ ఐసీసీ టోర్నీలో పాకిస్థాన్ క్రికెటర్లు పాల్గొనాలంటే భారత ప్రభుత్వం వాళ్లకు వీసాలు మంజూరుచేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లకు భారత ప్రభుత్వం వీసాలు జారీ చేస్తుందా లేదా అనే అంశంపై పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. గత కొన్నేళ్లుగా రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇది సాధ్యమవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే దీనిపై తమకు ఖచ్చితమైన హామీ ఇవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎహసాన్ మని కొంతకాలంగా కోరుతున్నారు. భారత ప్రభుత్వం నుంచి తమకు ఈ హామీ ఇప్పించాలని అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని ఆయన కోరారు.
దీనిపై చర్చించేందుకు బీసీసీఐతో ఐసీసీ గురువారం సమావేశమైంది. ఈ మీటింగ్‌లో తమకు రెండు అంశాలపై సానుకూల స్పందన లభించిందని ఐసీసీ వెల్లడించింది. పాకిస్థాన్ క్రికెటర్లకు వీసాల జారీపై భారత ప్రభుత్వంతో చర్చలు సానుకూలంగా ఉన్నట్లు బీసీసీఐ చెప్పిందని ఐసీసీ తెలిపింది.
ఇక రెండోది ఈ టోర్నీ ప్రభుత్వం నుంచి మినహాయింపులు కావాలని కూడా ఐసీసీ కోరుతోంది. ఈ విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. నెల రోజుల్లోపే ఈ రెండు సమస్యలు పరిష్కారమవుతాయని ఐసీసీ ఆశాభావం వ్యక్తం చేసింది.