గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2024 (14:58 IST)

వచ్చే యేడాది భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ సిరీస్!!

Bharat-Pakistan
చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ సిరీస్ వచ్చే యేడాది జరుగనుంది. మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. వచ్చే యేడాది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ 2025లో కాకుండానే భారత్, పాకిస్థాన్‌ల మధ్య మరో ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా కప్‌లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. 
 
2025లో టీ20 ఫార్మెట్‌లో జరుగనున్న ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీలో తాత్కాలిక ఫార్మెట్ ప్రకారం భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయని, టోర్నీలో సూపర్ 4 దశలో రెండోసారి తలపడే అవకాశం లేకపోలేదని ఆసియా క్రికెట్ మండలి వర్గాలు పేర్కొన్నాయి. ఇరు జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తే మూడో మ్యాచ్ కూడా జరిగే అవకాశం ఉందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధికారి ఒకరు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, వచ్చే యేడాది ఆరంభంలో పాకిస్థాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ 2025 జరుగనుంది. ఈ టోర్నీలో నిర్వహణకు 70 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ఐసీసీ ఆమోదించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీ ఆర్థిక విభాగం సంయుక్తంగా రూపొందించిన బడ్జెట్‌ను బీసీసీఐ కార్యదర్శి జై షా సారథ్యంలోని ఐసీసీ ఫైనాన్షియల్, కమర్షియల్ కమిటీ పరిశీలించి ఆమోదముద్ర వేసింది. అదనపు బడ్జెట్‌గా 4.5 మిలియన్ డాలర్లు మాత్రమే కేటాయించారని సమాచారం.