శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2024 (14:25 IST)

పారిస్ ఒలింపిక్స్ : చేజారిన పతకం.. నాలుగో స్థానానికి మను బాకర్ పరిమితం!!

manu baker
పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత షూటర్ మను బాకర్‌కు శనివారం నిరాశ ఎదురైంది. ఆమెకు మూడో పతకం తృటిలో చేజారింది. 25 మీటర్ల పిస్టోల్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. ఫలితంగా ఆమె ఖాతాలో మరో పతకం చేజారిపోయింది. అయితే, మను బాకర్ మాత్రం ఇప్పటికే రెండు కాంస్య పతకాలను గెలుచుకున్న విషయం తెల్సిందే. ఈ పతకాలతో ఆమె స్వదేశానికి చేరుకోనున్నారు. 
 
ఈ క్రీడా పోటీల్లో భాగంగా, శనివారం 25 మీటర్ల పిస్టోల్ విభాగంలో ఫైనల్ స్టేజ్ వన్ను మను బాకర్ కాస్త నెమ్మదిగా ప్రారంభించింది. ఇక్కడ సిరీస్ 1లో కేవలం 2 షాట్లను మాత్రమే కొట్టింది. ఆ తర్వాత మాత్రం మెరుగైన ప్రదర్శన చేసింది. సిరీస్ 2లో నాలుగు, సిరీస్ 3లో నాలుగు షాట్లు కొట్టి పైకి ఎగబాకింది. సిరస్ 6 వరకు అత్యుత్తమంగా షూట్ చేసిన మనుభాకర్ ఏకంగా రెండో స్థానానికి చేరుకుంది.
 
ప్రత్యర్థి షూటర్లు కూడా మంచి ప్రదర్శన కనబరచడంతో పోటీని ఎదుర్కొంది. ఎలిమినేషన్ చివరి సిరీస్ 8లో కేవలం రెండు షాట్లను మాత్రమే కొట్టడంతో మను బాకర్ రేసులో వెనుకబడిపోయింది. హంగేరీ అథ్లెట్ కామెలీ 3 షాట్లతో మూడో స్థానానికి చేరుకుంది. దీంతో మనుభాకర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. కాగా, ఈ ఒలింపిక్ పోటీల్లో మహిళల విభాగంలో ఒక కాంస్యాన్ని, మిక్స్డ్ విభాగంలో మరో కాంస్యాన్ని గెలుచుకుంది. రెండు పతకాలతో ఆమె భారత్ తిరిగిరానుంది.