శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (16:17 IST)

గంభీర్ గొప్ప మనసు - పని మనిషికి అంత్యక్రియలు నిర్వహించిన ఎంపీ

సాధారణంగా తమ ఇంట్లో పని చేసేవారు చనిపోతే ఆ కుటుంబానికి కొంత డబ్బు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కానీ, బీజేపీ ఎంపీగా ఉన్న మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నాడు. చనిపోయిన పని మనిషి అంత్యక్రియలను దగ్గరుండిమరీ జరిపించాడు. పైగా, ఆమె మా ఇంటి పనిమనిషికాదనీ.. తమ కుటుంబ సభ్యురాలు అంటూ ట్వీట్ చేసి తనలోని మానవత్వాన్ని మరోమారు నిరూపించుకున్నాడు. 
 
ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన సరస్వతి పాత్రా(49) అనే మహిళ గత ఆరేళ్లుగా గంభీర్‌ ఇంట్లో పనిచేస్తున్నారు. డయాబెటీస్‌, బీపీ తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చింది. అయితే, ఈమె ఈ నెల 21వ తేదీన కన్నుమూసింది. 
 
ప్రస్తుతం కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లడం వీలుపడలేదు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు గంభీర్ దృష్టికి తీసుకొచ్చారు. వారి మాటలకు చలించిపోయిన గంభీర్... కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత స్వయంగా తానే సరస్వతి పాత్రా అంత్యక్రియలను నిర్వహించారు.
 
దీనిపై గంభీర్ ట్విట్టర్‌లో స్పందించారు. "నా చిన్నారులను జాగ్రత్తగా చూసుకునే ఆమె.. ఎన్నటికీ పనిమనిషి కారు. తను మా కుటుంబంలో సభ్యురాలు. ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత. కులం, మతం, సామాజిక హోదా ఏదీ పట్టించుకోలేదు. వ్యక్తిత్వాన్ని గౌరవించాను. మెరుగైన సమాజాన్ని నిర్మించేందుకు ఇంతకంటే మంచి మార్గం లేదు. నా దృష్టిలో అదే నిజమైన భారత్‌! ఓం శాంతి" అని ట్వీట్‌ చేశారు
 
గంభీర్ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. అలాగే, కేంద్ర మంత్రి ధర్మేద్ర ప్రదాన్ కూడా గంభీర్‌ చర్యను ప్రశంసించారు. ఇంట్లో పనిచేసే వారిని తన మనిషిగా చూడటమేకాకుండా ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించడం గంభీర్ గొప్పతనమని, ఆయన మానవతా దృష్టికి నిదర్శనమని అన్నారు. ఆయన వ్యవహరించిన తీరు ఎందరికో స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు.