గురువారం, 7 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (09:07 IST)

లక్నోలో టీ20లో ఉత్కంఠ పోరు.. చమటోడ్చి నెగ్గిన భారత్

team india
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ చమటోడ్జి నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టును 99 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత 100 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆపసోపాలు పడింది. చివరకు 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి రెండో టీ20లో గెలిచి పరువు నిలబెట్టుకుంది. 
 
తొలి టీ20లో కివీస్ జట్టు విజయభేరీ మోరీ మోగించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆదివారం లక్నోలో జరిగిన రెండో టీ20లో భారత జట్టుకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిన నిర్బంధ పరిస్థితిలో ఉన్న భారత జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులుచేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 19.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ విన్నింగ్ షాట్‌గా బౌండరీ కొట్టడంతో విజయం ఖరారైంది. సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులతో, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 15 పరుగులతే అజేయంగా నిలిచారు. 
 
మిగిలిన ఆటగాళ్లలో శుభమన్ గిల్ 11, ఇషాన్ కిషన్ 19, రాహుల్ త్రిపాఠి 13, వాష్టింగన్ సుందర్ 10 చొప్పున పరుగులు చేశారు. కివీల్ బౌలర్లలో మైఖేల్ బ్రేస్వేల్, ఇష్ సోథీ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. కిషన్, సుందర్‌లు రనౌట్ రూపంలో వెనుదిరిగారు. ఇకపోతే, సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టీ20 మ్యాచ్ ఫిబ్రవరి ఒకటో తేదీన అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్వమివ్వనుంది.