మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (18:52 IST)

హరారేలో జింబాబ్వే చిత్తు - 10 వికెట్ల తేడాతో భారత్ విజయభేరీ

team india
మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. గురువారం ఆతథ్య జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వికెట్ నష్టపోకుండా పది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు చెలరేగి ఆడారు. ఫలితంగా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 30.5 ఓవర్లలో జింబాబ్వే నిర్దేశించి 189 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకుంది. 
 
అంతకుముందు హరారే వేదికగా జరిగిన ఈ వన్డేలో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో బౌలింగ్‌కు తొలుత మొగ్గు చూపినట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపారు. దీంతో జింబాబ్వే జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా మరుమని, ఇన్నోసెంట్ కైయా బరిలోకి దిగారు. తొలి ఓవర్‌ను దీపక్ చాహర్ వేశాడు. 
 
ఈ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. కైయా ఒక పరుగు చేయగా, మిగిలిన 5 రన్స్ లెగ్ బైస్ రూపంలో వచ్చాయి. తొలి 15 ఓవర్లు ముగిసే సమయానికి జింబాబ్వే జట్టు ఐదు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. ఆ తర్వాత ఎక్కడా కూడా జింబాబ్వే ఆటగాళ్లు కుదురుగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ఫలితంగా 40.3 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ జట్టు వికెట్ కీపర్ రెగిస్ చక్‌బ్వా చేసిన 35 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. భారత బౌలర్లలో దీపక్ చాహల్, ప్రసిద్ధ్ కృష్ణన్, అక్సర్ పటేల్‌లు తలా మూడేసి వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. 
 
ఆ తర్వాత 190 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఈ లక్ష్యాన్ని ఓపెనర్లే ఛేదించారు. శిఖర్ ధావన్ 81, శుభమన్ గిల్‌ 82 చొప్పున పరుగులు సాధించగా, అదనంగా 29 పరుగులు వచ్చాయి. దీంతో 30.5 ఓవర్లలో 6.22 రన్‌రేట్‌తో విజయం సాధించాయి.