శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 జనవరి 2021 (15:00 IST)

నాలుగో టెస్ట్‌.. లంచ్‌కు ముందే ఆసీస్ ఆలౌట్.. నటరాజన్ అరుదైన రికార్డ్

భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌ తొలి ఇన్సింగ్స్‌లో ఆతిథ్య జట్టు మొదటి ఇన్సింగ్స్‌లో ఆసీస్‌ 369 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆ జట్టు ఆటగాళ్లలో లబుషేన్ 108, టిమ్ పైన్ 50, గ్రీన్ 47 పరుగులతో రాణించారు. 274/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఈ రోజు ఆటలో భాగంగా లంచ్‌కు ముందే ఆసీస్‌ను ఆలౌట్‌ చేశారు. ఓవరనైట్‌ ఆటగాళ్లు పైన్‌, కామెరూన్‌ గ్రీన్‌లు ఆకట్టుకున్నారు.
 
ఈ జోడి 98 పరుగులు జోడించారు. ఆరో వికెట్‌గా పైన్‌ ఔటైన తర్వాత ఆసీస్‌ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్లలో స్టార్క్‌ 20 పరుగులతో అజేయంగా నిలవగా, లయన్‌ 24 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో నటరాజన్‌, శార్దూల్‌ ఠాకూర్, వాషింగ్టన్‌‌లు తలో మూడు వికెట్లు సాధించగా, సిరాజ్‌కు వికెట్‌ దక్కింది. 
 
నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లు 1-1తో సిరీస్‌ సమానంగా ఉన్నాయి.చివరి టెస్ట్‌లో ఎవరి గెలిస్తే వారికే సిరీస్‌ దక్కుతుంది. దీంతో నాలుగో టెస్టులో గెలుపు కోసం ఇరుజట్లు తీవ్రం‍గా శ్రమించే అవకాశం ఉంది. 
 
మరోవైపు ఈ సీజన్‌ ఐపీఎల్‌ మొదలుకొని వచ్చిన ప్రతీ అవకాశాన్ని టీమిండియా సీమర్‌ నటరాజన్‌ సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇటీవల టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి సత్తాచాటిన నటరాజన్‌.. టెస్టు క్రికెట్‌లోకి అనూహ్యంగా దూసుకొచ్చి తనకు ఏ ఫార్మాట్‌ అయినా ఒకటేనని చాటి చెప్పాడు. ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో చోటు దక్కించుకుని టెస్టుల్లో అరంగేట్రం చేసిన నటరాజన్‌.. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో దుమ్ములేపాడు. 
 
లబూషేన్‌, మాథ్యూవేడ్‌లతో పాటు హజిల్‌వుడ్‌ వికెట్‌ను నటరాజన్‌ సాధించాడు. దాంతో ఒక అరుదైన జాబితాలో నటరాజన్‌ చేరిపోయాడు.  భారత్‌ తరఫున టెస్టుల్లో అరంగేట్రం ఇన్నింగ్స్‌ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మూడో లెఫ్మార్మ్‌ సీమర్‌గా నటరాజన్‌ నిలిచాడు. ఈ జాబితాలో ఆర్పీసింగ్‌(2005-06 సీజన్‌లో పాకిస్తాన్‌పై), ఎస్‌ఎస్‌ న్యాల్‌చంద్‌(1952-53 సీజన్‌లో పాకిస్తాన్‌పై)లు ఉండగా ఇప్పుడు నటరాజన్‌ చేరిపోయాడు.