గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (07:43 IST)

సమారానికి సై - నేడు భారత్ ఇంగ్లండ్ పోరు

icct20worldcup
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా గురువారం భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా మధ్యాహ్నం 1.30 గంటలకు తలపడతాయి. ఈ బ్లాక్ బస్టర్ సెమీ ఫైనల్‌ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఎందుకంటే.. ఇప్పటికే దాయాది దేశం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఈ పొట్టి క్రికెట్‌లో ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఇపుడు అందరి దృష్టీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌పై పడింది. 
 
అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌ను ఏ ఒక్క జట్టూ తేలిగ్గా తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. గత 2013 నుంచి చూసుకుంటే ఐసీసీ ఈవెంట్లలో సెమీస్, ఫైనల్లో భారత్‌కు ఏమాత్రం కలిసి రావడం లేదు. 2014లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌ను పాకిస్థాన్ ఓడించింది. 
 
2016లో జరిగిన టీ20 వరల్డ్ సెమీస్‌, 2017 ఛాంపియన్స్ ట్రోఫై ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌ను దాటలేక పోయింది. ఈ అన్ని టోర్నీల్లో సభ్యుడిగా ఉన్న రోహిత్ శర్మ ఇపుడు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సారి మాత్రం భారత్‌ను విశ్వవిజేతగా నిలపాలన్న పట్టుదలతో ఉన్నాడు. 
 
అయితే, అత్యంత కీలకమైన ఈ మెగా ఈవెంట్ ఆరంభం నుంచి రోహిత్ శర్మ ఏమాత్రం ఫామ్‌లో లేడు. ఇది జట్టును తీవ్రంగా వేధిస్తుంది. పైగా, సెమీస్‌కు ముందు నెట్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. అయినప్పటికీ తాను ఫిట్‌గానే ఉన్నట్టు ప్రకటించారు. 
 
జట్టులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువ ఆటగాడు సూర్యకుమార్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలు మాత్రమే రాణిస్తుంటే, ఓపెనర్ కేఎల్ రాహుల్‌ టచ్‌లోకి వచ్చినా అతనిపై అధికంగా ఆశలు పెట్టుకోలేని పరిస్థితి. బౌలింగ్ విభాగంలో భువి, షమి, అర్ష్‌దీప్‌ల పేస్ త్రయం నిలకడగా రాణిస్తున్నప్పటికీ స్పిన్ విభాగం మాత్రం బలహీనంగా కనిపిస్తుంది.