శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (12:21 IST)

కరేబియన్ దీవుల్లో టీమిండియా విజయకేతనం... సౌరవ్ రికార్డు బ్రేక్

కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఆతిథ్య వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 318 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. దీంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీ సేన 1-0 తేడాతో ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. కాగా, భారత జట్టుకు ఇది నాలుగో అతిపెద్ద విజయం కావడం గమనార్హం. అలాగే, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియాకు ఇది 27వ విజయం, ఈ గెలుపుతో విరాట్‌ కోహ్లీ మాజీ కెప్టెన్‌ ధోనీ సరసన చేశాడు. 
 
గతంలో భారత క్రికెట్ జట్టు ధోనీ కెప్టెన్సీలో 27 మ్యాచుల్లో విజయం సాధించింది. ఈ రికార్డును కోహ్లీ సమం చేశాడు. పైగా, విదేశాల్లో అధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియాకు విదేశాల్లో ఇది 12వ విజయం. ఫలితంగా సౌరవ్‌ గంగూలీ సారథ్యంలో 11 విజయాల రికార్డు బ్రేక్‌ అయింది. ఇక వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత జట్టు ఈ టెస్టు విజయంతో ఐసీసీ టెస్టు చాంపియన్‌ షిప్‌ను ఘనంగా ఆరంభించింది.
 
ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లలో రహానె(102), విహారి(93) రాణించడం.. బౌలింగ్‌లో బుమ్రా(5/7), ఇషాంత్(3/31) విజృంభించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా బోణీ చేసింది. ప్రత్యర్థికి 419 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్.. కరీబియన్ జట్టును అతి తక్కువ స్కోరుకే కుప్పకూల్చి అద్భుత విజయాన్నందుకుంది. 
 
భారత పేసర్లు బుమ్రా, ఇషాంత్‌ల ధాటికి విండీస్ 26.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా కోహ్లీసేన 318 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.భారత టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇది నాలుగో అతిపెద్ద విజయం కావడం విశేషం. రెండు ఇన్నింగ్స్‌లో సూపర్ షో చేసిన రహానె(81, 102) 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
 
అంతకుముందు నాలుగో రోజు రహానె, విహారి రాణించడంతో భారత్ ఆధిక్యం 400 దాటగానే 343/7(112.3 ఓవర్లు) వద్ద కెప్టెన్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కరీబియన్లు పెవిలియన్ బాటపట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. ప్యాడ్ కట్టుకున్నంతసేపు కూడా క్రీజులో నిలువలేకపోయారు. ఓ వైపు భారత్ పేసర్లు పదునైన బంతులతో విరుచుకుపడుతుంటే డిఫెన్స్ కూడా ఆడలేకపోయారు. 
 
వచ్చిన వారు వచ్చినట్లే డ్రెస్సింగ్ రూమ్‌కు క్యూ కట్టారు. విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో ముగ్గురు ఆటగాళ్లు రోస్టన్ ఛేజ్(12), రోచ్(38), కమిన్స్(19 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మరీ ముఖ్యంగా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అత్యంత చెత్తప్రదర్శనతో నిరాశపరిచారు. ఏ ఒక్కరు కూడా కనీసం 20 బంతులాడలేకపోయారు. క్రెయిగ్ బ్రాత్‌వైట్(1), క్యాంప్‌బెల్(7), బ్రూక్స్(2), డారెన్ బ్రావో(2), హెట్‌మైర్(1), షెయ్ హోప్(2), జాసన్ హోల్డర్(8) పేలవ బ్యాటింగ్‌తో ఘోరంగా విఫలమయ్యారు. 
 
తమ సొంత గడ్డపై ఏ ఒక్కరు కూడా భారత్ బౌలర్ల ఎదురుదాడిని అడ్డుకోలేక చేతులెత్తేశారు. వైవిధ్యమైన బంతులతో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను బుమ్రా వణికించాడు. మ్యాచ్‌లో బుమ్రా ప్రదర్శనే హైలెట్‌గా నిలిచింది. 8 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 7 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అందులో మూడు ఓవర్లు మెయిడిన్ కావడం విశేషం.