శుక్రవారం, 22 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 మే 2021 (20:39 IST)

ఐపీఎల్ 2021.. మాల్దీవులకు ఆస్ట్రేలియా క్రికెటర్లు..

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో పాల్గొన్న కొంతమంది ఆటగాళ్లు కొవిడ్‌ బారిన పడుతుండడంతో ఈ లీగ్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో విదేశీ ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. కొంతమంది ఇంగ్లాండ్‌ క్రికెటర్లు ఇప్పటికే లండన్‌ బయలుదేరి వెళ్లారు.
 
కరోనా విజృంభణ కారణంగా మే 15 వరకు భారత్‌ నుంచి ప్రయాణికులు ఎవరూ ఆస్ట్రేలియాకు రాకుండా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారత్‌లో ఉన్న ఆసీస్‌ ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఆసీస్‌ ఆటగాళ్లు మాల్దీవ్స్‌ మీదుగా తమ దేశానికి వెళ్లాలనుకుంటున్నారు. త్వరలో చార్టర్డ్‌ విమానంలో మాల్దీవ్స్‌కు వెళ్లి, ఆస్ట్రేలియా సరిహద్దులను తెరిచే వరకు అక్కడే వేచి ఉండాలని క్రికెటర్లు నిర్ణయించుకున్నారని ఓ అధికారి బుధవారం తెలిపారు.
 
38 మంది సభ్యుల ఆస్ట్రేలియా బృందంలో ఆటగాళ్లు, కోచ్‌లు, అంపైర్లు, వ్యాఖ్యాతలు ఉన్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని దేశంలోకి అనుమతించే వరకు మాల్దీవ్స్‌లోనే ఉండటానికి ఆసక్తి చూపించారు. ‘ఆస్ట్రేలియన్లు అందరూ ఇవాళ ఢిల్లీలో కలుసుకుంటారు. అక్కడి నుంచి వారంతా చార్టర్డ్‌ ఫ్లైట్‌ ద్వారా మాల్దీవులకు వెళతారని’ కేకేఆర్‌ అధికారి వెల్లడించారు.