సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (10:56 IST)

కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు

Rohit Sharma
భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ప్రశంసలు అందుకున్నారు. అయితే, స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రోహిత్ సారథ్యంలోని టీమిండియా అత్యంత అవమానకరంగా ఓడిపోయింది. మూడు టెస్ట్ మ్యాచ్‌లలోనూ చిత్తుగా ఓడిపోయింది. తద్వారా స్వదేశంలో 12 యేళ్లుగా కొనసాగుతూ వచ్చిన భారత క్రికెట్ జట్టు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 
 
స్వదేశంలో న్యూజిలాండ్ జరిగిన మూడు మ్యాచ్‌లలో టెస్ట్ సిరీస్‌ను 0-3 తేడాతో అవమానకర రీతిలో కోల్పోవడంతో ప్రతి ఒక్కరూ రోహిత్ శర్మను వేలెత్తి చూపుతున్నారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ స్వదేశంలో వైట్‌వాష్‌కు గురికావడం చాలాకాలం తర్వాత ఇదే తొలిసారి. దీంతో ఈ ఓటమి రోహిత్ శర్మ కెరీర్లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనుంది. 
 
మరోవైపు కివీస్ చేతిలో వరుసగా ఎదుర్కొన్న ఈ మూడు ఓటములతో రోహిత్ శర్మ ఖాతాలో ఓ అవాంఛిత రికార్డు చేరింది. స్వదేశంలో అత్యధిక టెస్ట్ ఓటములు చవిచూసిన రెండో భారత కెప్టెన్‌గా హిట్ మ్యాన్ చరిత్ర పుటల్లో నిలిచాడు. స్వదేశంలో అత్యధిక టెస్టులు ఓడిన కెప్టెన్లుగా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, రోహిత్ శర్మ, మహ్మద్ అజారుద్దీన్, కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీలు ఉన్నారు. 
 
స్వదేశంలో అత్యధిక టెస్ట్ ఓటములు మూటగట్టుకున్న కెప్టెన్ల జాబితాలో మాజీ దిగ్గజం మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తొలి స్థానంలో ఉన్నారు. ఆయన సారధ్యంలో భారత జట్టు స్వదేశంలో మొత్తం 27 టెస్టులు ఆడగా అందులో 9 పరాజయాలు ఎదురయ్యాయి. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు ఇప్పటివరకు 16 టెస్టులు ఆడగా 5 పరాజయాలను రోహిత్ ఎదుర్కొన్నాడు. ఈ ఐదు ఓటములు తాజాగా న్యూజిలాండ్ చేతిలోనే కావడం గమనార్హం.
 
మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సారధ్యంలో భారత జట్టు మొత్తం 20 టెస్టులు ఆడగా 4 ఓటములు ఎదురయ్యాయి. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు స్వదేశంలో 20 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. అయితే నాలుగు టెస్టుల్లో జట్టు ఓటమి పాలైంది. ఈ జాబితాలో మాజీ దిగ్గజ బౌలర్ బిషన్ సింగ్ బేడీ 5వ స్థానంలో ఉన్నారు. ఆయన సారథ్యంలో భారత జట్టు స్వదేశంలో 8 టెస్టులు ఆడగా 3 మ్యాచ్‌ల్లో ఆయన ఓటమి చవిచూశారు.