1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (19:03 IST)

దూసుకుపోతున్న రూట్ - కోహ్లీని దాటేశాడు

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సారథి జోరూట్ దూసుకుపోతున్నాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని దాటేశాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ రెండో స్థానం దక్కించుకున్నాడు. అగ్రస్థానంలోని కేన్‌ విలియమ్సన్‌ కొనసాగుతున్నాడు. కేన్స్‌కు రూట్‌కు మధ్య పాయింట్ల పరంగా స్వల్ప తేడా వుంది. 
 
పాయింట్ల పరంగా చూస్తే కేన్‌ విలియమ్సన్‌ 901 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 180 (నాటౌట్), తొలి టెస్టులోనూ సెంచరీ చేయడంతో ఏకంగా రెండో స్థానానికి ఎగబాకాడు. అతడి ఖాతాలో 893 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. అగ్రస్థానంలోని ఇద్దరి మధ్య అంతరం కేవలం ఎనిమిది పాయింట్లే కావడం గమనార్హం. అతడు ఇదే ఫామ్‌ కొనసాగిస్తే నంబర్‌వన్‌ చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
 
కాగా, రెండేళ్లుగా శతకాలు చేయనప్పటికీ సమయోచితంగా పరుగులు చేస్తున్న విరాట్‌ కోహ్లీ (776) తన ఐదో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (773), వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ (736) వరుసగా 6, 7 స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ, రోహిత్‌ మధ్య అంతరం కేవలం 3 పాయింట్లే ఉంది. అజింక్య రహానె (677) సంయుక్తంగా 14వ స్థానంలో ఉన్నాడు. చెతేశ్వర్‌ పుజారా (658) 18వ స్థానంలో కొనసాగుతున్నాడు.