గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (20:13 IST)

కేఎల్ రాహుల్ చెత్త రికార్డ్.. శార్దూల్‌పై కోహ్లీ అసహనం.. వైరల్ వీడియో

ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన మూడో టీ20లో రాహుల్ డకౌట్ అయ్యాడు. ఈ సిరీస్‌లో రాహుల్‌ పరుగులేమీ చేయకుండా అవుట్ కావడం ఇది వరుసగా రెండోసారి. ఫలితంగా టీ20 సిరీస్‌లో/ఓ టోర్నమెంటులో ఎక్కువసార్లు డకౌట్ అయిన భారత ఆటగాడిగా మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా, అంబటి రాయుడు సరసన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ చేరాడు. రాహుల్ తన చివరి నాలుగు ఇన్సింగ్స్‌లలో మూడుసార్లు డకౌట్ కావడం గమనార్హం. 
 
రోహిత్ శర్మ జట్టులోకి రావడంతో మూడో టీ20లో రాహుల్‌కు విశ్రాంతి ఇస్తారని భావించారు. అయితే, ఆశ్చర్యకరంగా సూర్యకుమార్ యాదవ్‌ను బెంచ్‌కు పరిమితం చేసి రాహుల్‌కు అవకాశం కల్పించారు. అయితే, దక్కిన అవకాశాన్ని రాహుల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
 
గతేడాది జరిగిన ఐపీఎల్‌లో మాత్రం రాహుల్ భీకర ఫామ్ ప్రదర్శించాడు. టోర్నమెంటులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్నాడు. అయితే, ఆ తర్వాతి నుంచి పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
 
ఇకపోతే.. మంగళవారం నాటి మ్యాచ్‌లో కోహ్లి శార్దూల్‌ ఠాకూర్‌పై అసహనం వ్యక్తం చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో టీ20లో, 12వ ఓవర్‌లో భాగంగా చహల్‌ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో బంతిని లెగ్‌ సైడ్‌ బాదగా, అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న శార్దూల్‌ నెమ్మదిగా కదిలాడు. 
 
అంతేగాక బంతి దొరకగానే సరిగా త్రో చేయలేకపోయాడు. మిస్‌ఫీల్డింగ్‌ కారణంగా ఇంగ్లండ్‌కు మరో పరుగు అదనంగా వచ్చింది. దీంతో కోహ్లి శార్దూల్‌ను చూస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ఇక అప్పటికే బెదురుగా చూస్తున్న శార్దూల్‌, తన తప్పేమీ లేదన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చాడు. అయితే, కోహ్లి మాత్రం ఇదేమీ బాగాలేదన్నట్లుగా కోపంగా చూశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.