మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఆసియా కప్‌లో నేడు : శ్రీలంకతో భారత్ ఢీ.. గెలిచి తీరాల్సిన మ్యాచ్..

ind vs sl
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా, మంగళవారం భారత జట్టుకు అగ్నిపరీక్ష ఎదురుకానుంది. సూపర్-4లో టీమిండియా ఆడిన తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. దీంతో శ్రీలంకతో మంగళవారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో భారత గెలిచి తీరాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. 
 
టీమిండియాను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే రవీంద్ర జడేజా, బుమ్రా, హర్షల్‌లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. దీంతో జట్టు బౌలింగ్ సమతూకం దెబ్బతింది. పాక్‌ మ్యాచ్‌లో భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగినప్పటికి విజయం సాధించలేక పోయింది. హార్దిక్ పాండ్యా, చాహల్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చారు. దీంతో భారత్ నిర్ధేశించిన 181 పరుగుల భారీ లక్ష్యాన్ని దాయాది జట్టు మరో బంతి మిగిలివుండగానే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
 
అందుకే శ్రీలంకతో జరిగే మ్యాచ్‌‍లో మూడో స్పెషలిస్ట్ బౌలర్‌గా ఆవేష్ ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే, ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు క్రీజ్‌లో నిలబడి భారీగా పరుగులు చేయలేకపోతున్నారు. 
 
మధ్య ఓవర్లలో కూడా ఆశించిన మేరకు బ్యాట్స్‌మెన్లు ఆశించిన మేరకు పరుగులు రాబట్టలేక పోతున్నారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన రెండు అర్థ సెంచర్లీల్లో పెద్దగా చెప్పుకోదగిన విధంగా మెరుపులు లేవు. అందుకే మంగళవారం జరిగే మ్యాచ్‌‍లో బ్యాట్స్‌మెన్స్ విరుచుకుపడితేనే విజయం సాధ్యమవుతుంది. లేనిపక్షంలో ఆందోళన తప్పదు. 
 
మరోవైపు, తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత శ్రీలంక జట్టు ఒక్కసారిగా పుంజుకుంది. బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ జట్లతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరును కనబరిచింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆడగలమని లంకేయులు నిరూపించి, ఆత్మ విశ్వాసంతో కనిపిస్తున్నారు. అందుకే ఒత్తిడిలో ఉన్న భారత్‌పై తమదే పైచేయి కావాలన్న పట్టుదలతో లంకేయులు ఉన్నారు. 
 
తుది జట్ల అంచనా...
భారత్ : రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, భువనేశ్వర్, ఆవేశ్ ఖాన్, చాహల్, అర్ష్‌దీవ్ సింగ్. 
 
శ్రీలంక : నిస్సాంక, కుశాల్ మెండీస్, అసలంక, గుణతిలక, రాజపక్స, షనక (కెప్టెన్), హసరంగ, కరుణరత్నె, తీక్షణ లేదా జయవిక్రమ, ఫెర్నాండో, మదుశంక.