గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (18:29 IST)

క్లార్క్-కైలీల విడాకులు.. రూ.280కోట్ల పరిహారం.. వామ్మో అంత మొత్తమా?

Michael Clarke
ఫిబ్రవరి 14న ప్రేమికులు ఒక్కటవుతున్న సందర్భంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ వివాహ బంధానికి ముగింపు పలికాడు. ఈ వార్త క్రికెట్ ఫ్యాన్సుకు షాకిచ్చింది. క్లార్క్‌, కైలీ దంపతులు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేశారు. కొంతకాలం ఇద్దరం విడివిడిగా జీవించిన తర్వాత.. స్నేహపూర్వకంగా విడిపోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వీరికి ప్రస్తుతం నాలుగేళ్ల కుమార్తె కెల్సే ఉన్నారు.
 
అలాగే తమ కుమార్తెను ఇద్దరం పరస్పరం గౌరవించుకుంటూ చూసుకుంటామని చెప్పారు. అలాగే తమ ప్రైవసీని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే క్లార్క్, కైలీ దంపతులు కోర్టు వెలుపలే తమ విడాకుల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 
 
2011లో రికీ పాంటింగ్‌ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న క్లార్క్‌ ఆసీస్‌ క్రికెట్‌ జట్టును నడిపించడంలో సక్సెస్‌ అయ్యాడు. పాంటింగ్‌కు సరైన వారసుడిగా ఆసీస్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను క్లార్క్‌ అందించాడు. తన 12 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో 115 టెస్టులు, 245 వన్డేలతో పాటు 34 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2015లో జరిగిన యాషెస్‌ సిరీస్‌ అనంతరం క్లార్క్‌ క్రికెట్‌ గుడ్‌ బై చెప్పాడు.
 
కాగా.. టీవీ యాంకర్ అయిన కైలీని క్లార్క్ ఏడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు. విడాకుల కోసం భార్యకు ఏకంగా 280 కోట్ల రూపాయల పరిహారాన్ని ఇచ్చాడని మీడియాలో వార్తలు వచ్చాయి.  ఇలా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులు తీసుకున్న జంటగా మాజీ క్రికెటర్ క్లార్క్-కైలీకి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.