శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

భార్యకు ప్రతి నెల రూ.50 వేలు చెల్లించండి.. పేసర్ షమీకి కోర్టు ఆదేశం

shami- jahan
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి కోర్టులో చుక్కెదురైంది. ఆయన మాజీ భార్య హసీన్ జహాన్‌కు నెలకు రూ.50 వేలు భరణం కింద చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు అలీపూర్ కోర్టు న్యాయమూర్తి అనిందిత గంగూలీ తీర్పు ఇచ్చారు. అయితే, ఈ తీర్పును హసీన్ జహాన్ కోల్‍‌కతా హైకోర్టులో సవాలు చేయనున్నట్టు ప్రకటించారు. 
 
జాదవ్‌పూర్ పోలీస్ స్టేషనులో షమీపై జహాన్ గృహహింస కేసు పెట్టింది. ఈ కేసు నేపథ్యంలో షమీపై నాన్ బెయిలబుల్, హత్యాయత్నం వంటి అభియోగాలను నమోదు చేశారు. తాను తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిన ప్రతిసారి చిత్రహింసలకు గురిచేసేవారంటూ జహాన్ ఆరోపించారు. పైగా, వివిధ ఫోన్ నంబర్ల ద్వారా షమీ తనను బెదిరించారని ఆరోపించారు. అయితే, షమీ మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపారేశారు. తనను అప్రతిష్టపాలు చేసేందుకే జరుగుతున్న కుట్రలో భాగంగా పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే క్షమాపణలు చెప్పేందుకు కూడా తాను సిద్ధమని ప్రకటించారు.
 
మరోవైపు, జహాన్ మాత్రం తన వ్యక్తిగత ఖర్చుల కోసం రూ.7 లక్షలు, కుమార్తెను చూసుకునేందుకు రూ.3 లక్షలు కలిపి మొత్తంగా నెలకు రూ.10 లక్షలు ఇప్పించాలంటూ గత 2018లో కోర్టును ఆశ్రయించారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరిపిన కోర్టు నెలకు రూ.50 వేలు చొప్పున భరణం కింద జహాన్‌కు చెల్లించాలని అలీపూర్ కోర్టు ఆదేశించింది.