మంగళవారం, 29 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 అక్టోబరు 2024 (17:06 IST)

పూణే టెస్టులో ఒత్తిడిని ఎదుర్కోలేకపోయాం : రోహిత్ శర్మ

rohit sharma
పూణే వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఒత్తిడిని ఎదుర్కోలేక ఓటమిపాలైనట్టు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ఈ మ్యాచ్‌లో భారత్ 113 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో 2012 తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను టీమిండియా కోల్పోయింది. దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ, గత పుష్కర కాలంలో ఈ ఒక్క టెస్ట్ సిరీస్ మాత్రమే కోల్పోయామని, కానీ, 18 టెస్ట్ సిరీస్‌లను గెలిచినట్టు సమర్థించుకున్నాడు. 
 
మ్యాచ్‌లో ఎదుర్కొన్న ఒత్తిడికి ప్రతిస్పందించడంలో తాము విఫలమయ్యామని సమర్థించుకున్నాడు. తాము మొదటి ఇన్నింగ్స్ సరిగా బ్యాటింగ్ చేయలేదని, పిచ్ అంత పేలవంగా ఏమీ లేదు, కానీ న్యూజిలాండ్ సాధించిన స్కోరు చేరుకోలేకపోయామని రోహిత్ అన్నాడు. శుభమాన్ గిల్ - యశస్వి జైస్వాల్ మంచి భాగస్వామ్యం అందించినా ఆ తర్వాత ఇన్నింగ్స్ సరిగా సాగలేదని అన్నాడు. గత రెండు టెస్ట్ మ్యాచ్‌లలో తప్పులు దొర్లాయని గుర్తు చేశాడు. 
 
ఇక సిరీస్‌ను కోల్పోవడంపై స్పందిస్తూ, ఈ సిరీస్‌ను కోల్పోవడానికి ముందు తాము 18 సిరీస్‌లు గెలిచామని రోహిత్ గుర్తుచేశాడు. కాబట్టి తాము చాలా విషయాల్లో బాగానే రాణించామని, భారత్‌లో సవాళ్లతో కూడిన పిచ్లపై ఆడామని, కాబట్టి ఇలాంటి ఓటములు ఎదురవుతూనే ఉంటాయన్నాడు. జట్టులోని ఎవరి సామర్థ్యాన్నీ తాను అనుమానించడం లేదన్నాడు.