బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (14:27 IST)

మెరుగైన వైద్యం కోసం ముంబైకు రిషబ్ పంత్.. బీసీసీఐ ప్యానెల్ సమీక్ష

rishabh pant
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారత జాతీయ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ముంబైకు తరలించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పెద్దలు భావిస్తున్నారు. ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందించాలని, అక్కడ వీలుపడకపోతే మరింత మెరుగైన వైద్యం కోసం విదేశానికి తరలించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు బీసీసీఐకు చెందిన వైద్యుల ప్యానెల్ రిషబ్ పంత్ మెడికల్ రిపోర్టులను ఎగ్జామిన్ చేయనుంది. 
 
కాగా, డిసెంబరు 30వ తేదీన రూర్కీ జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోకాలులో లిగమెంట్ తెగిపోయింది. నుదురు, వీపు భాగాలపై గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతడికి డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, మెరుగైన చికిత్స కోసం పంత్‌ను ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించాలని బీసీసీఐ భావిస్తుంది. 
 
అంతేకాకుండా, బీసీసీఐ ప్యానెల్ వైద్యులు రిషబ్ పంత్‌ వైద్య రిపోర్టులను పరిశీలించి, అతడి తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు. దీని ఆధారంగా అవసరమైతే మెరుగైన చికిత్స కోసం పంత్‌ను విదేశానికి తరలించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా, లండన్‌కు తరలించే అవకాశాలు ఉన్నట్టు బీసీసీఐ వర్గాల సమాచారం. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నారు. పంత్ మళ్లీ బరిలోకి దిగాలంటే అతని మోకాలి లిగమెంట్ సమస్య పూర్తిగా నయం కావాల్సివుంది. ఈ విషయంలోనే పంత్‌కు మెరుగైన వైద్యం అందించాలన్న తలంపులో బీసీసీఐ ఉంది.