రిషభ్ పంత్‌కు కపిల్ దేవ్ సలహా... డ్రైవర్‌ను పెట్టుకోవాలంటూ సలహా..
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు హర్యానా హరికేన్, క్రికెట్ లెజెండ్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఓ సలహా ఇచ్చారు. ఇదొక పాఠంగా భావించాలన్నారు. ఒక డ్రైవర్‌ను పెట్టుకోగల స్థోమత పంత్‌కు ఉందని, అందువల్ల ఓ డ్రైవర్‌ను పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. మనకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నపుడు సొంతంగా వాహనాన్ని నడపడం ఏమాత్రం భావ్యం కాదని అన్నారు. తనకు సైతం కేరీర్ ఆరంభంలో ఇలాంటి అనుభవం ఎదురైందని గుర్తు చేశారు.
గత శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్ ప్రాణాలతో బయటడ్డాడు. ఓ బస్సు డ్రైవర్ పంత్‌ను రక్షించాడు. ప్రస్తుతం డెహ్రాడూన్ ఆస్పత్రిలో పంత్ చికిత్స పొందుతున్నాడు. అతను కోలుకునేందుకు కనీసం ఐదారు నెలలు పడుతుందని వైద్యులు అంటున్నారు.
దీనిపై కపిల్ దేవ్ మాట్లాడుతూ, "ఇదొక పాఠం, నేను కూడా కెరీర్ మొదట్లో మోటారు సైకిల్ ప్రమాదానికి గురయ్యారు. ఆ రోజు నుంచి నా సోదరుడు నన్ను మోటార్ బైక్‌ను ముట్టుకోనివ్వలేదు. పంత్ క్షేమంగా బయటపడినందుకు దేవుడికి ధన్యవాదాలు చెబుతున్నాను.
నీకు మంచి కారు వుంది. దానిపై గొప్ప వేగంగా దూసుకుపోవచ్చు. కానీ, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఓ డ్రైవర్‌ను నియమించుకోవడం నీకు భారం కాదు. నీవు సొంతంగా కారును నడపవద్దు. ఎవరికైనా ఈ తరహా కోరికలు ఉంటాయనే అర్థం చేసుకోగలను. కానీ నీకంటూ బాధ్యతలు ఉన్నాయి. నీ గురించి నీవే జాగ్రత్తలు తీసుకోగలవు. నీ గురించి నీవు నిర్ణయం తీసుకోవాలి" అని కపిల్ దేవ్ అన్నారు.