ఐసీసీ ర్యాంకుల జాబితా : గిల్ ర్యాంకు వెనక్కి... రోహిత్ శర్మ ర్యాంకు పైకి  
                                       
                  
				  				   
				   
                  				  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా వెల్లడించిన ర్యాంకుల జాబితాలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాంకు మెరుగుపడింది. రోహిత్ శర్మ 781 పాయింట్ల సాయంతో అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా మాజీ క్రికెట్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఐసీసీ ర్యాంకుల పట్టికలో అగ్రస్థానాన్ని పొందిన ఆటగాడిగా నిలిచాడు.  
				  											
																													
									  
	 
	దాదాపు ఏడు నెలల తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాట్‌తో రాణించిన విషయం తెల్సిందే. మూడు వన్డేల సిరీస్‌లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆ సిరీస్‌లో రోహిత్ ప్రదర్శనకు ఐసీసీ ర్యాంకుల్లో ఫలితం కనిపించింది. వన్డేల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. 
				  
	 
	ఇప్పటివరకు అక్కడ ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు స్థానాలు కిందికి దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 781 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అఫ్గనిస్థాన్ ప్లేయర్ ఇబ్రహీం జద్రాన్ (764) రెండో స్థానంలో ఉండగా.. శుభ్‌మన్ గిల్ (745), బాబర్ అజామ్ (739), విరాట్ కోహ్లీ (725) ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఆసీస్‌తో మూడో వన్డేలో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ విరాట్ ఒక స్థానం పడిపోయాడు. అంతకుముందు రెండు మ్యాచుల్లోనూ డకౌట్ కావడమే దీనికి కారణమని క్రికెట్ విశ్లేషకుల అంచనా. శ్రేయస్ అయ్యర్ (700) టాప్ -10లో కొనసాగుతున్నాడు. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (589) ఏకంగా 23 స్థానాలను మెరుగుపర్చుకొని 25వ ర్యాంక్‌ను అందుకొన్నాడు. 
				  																		
											
									  
	 
	ఇక బౌలింగ్ విభాగంలో టీమ్‌ఇండియా తరపున కేవలం ఒక్కరు మాత్రమే ఉండటం గమనార్హం. అదీనూ కుల్‌దీప్ యాదవ్ (634) ఒక ప్లేస్‌ను కోల్పోయి ఏడో ర్యాంకులో నిలిచాడు. ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (628) రెండు స్థానాలు పైకి ఎగబాకి 8వ ర్యాంకులో ఉన్నాడు. ఆఫ్గాన్ ఆటగాడు రషీద్ ఖాన్ (710) బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 
				  																	
									  
	 
	ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా (215) మాత్రమే ఉన్నాడు. అతడు ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడని సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్ (208) రెండు స్థానాలను మెరుగుపర్చుకొని 12వ ర్యాంకులో నిలిచాడు. ఇందులోనూ ఆఫ్గన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్‌దే (334) టాప్ ర్యాంకర్‌గా ఉన్నాడు.