1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మే 2024 (10:01 IST)

ఐపీఎల్ విజేతగా కోల్‌కతా జట్టు... భావోద్వేగానికి గురైన షారూక్ ఖాన్!

sharukh khan
స్వదేశంలో దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ ప్రియులను ఆలరించిన ఐపీఎల్ 2024 సీజన్ ఆదివారంతో ముగిసింది. ఆదివారం రాత్రి చెన్నైలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ పోరులో కోల్‌కతా జట్టు విజయభేరీ మోగించింది. కేకేఆర్ జట్టు గతంలో 2012, 2014 తర్వాత ముచ్చటగా మూడోసారి ట్రోఫీని చేజిక్కించుకుంది. దీంతో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫీని గెలిచిన జట్టుగా కేకేఆర్ నిలిచింది. 
 
దీంతో ఆ జట్టు సహ-యజమాని షారుఖ్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యాడు. మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించిన షారుఖ్... కోల్‌కతా జట్టు ఫైనల్ మ్యాచ్ గెలిచిన వెంటనే పట్టరాని సంతోషంతో పక్కనే ఉన్న తన భార్య గౌరీ ఖాన్‌ను హత్తుకున్నాడు. ఆమెకు ముద్దు పెట్టాడు. ఆ సంతోషంలో సహ యజమానులతో కరచాలనం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్
మీడియాలో వైరల్‌ అయ్యాయి.
 
కోల్‌కతా జట్టు చివరిసారిగా 2014లో ట్రోఫీ గెలిచింది. పదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇప్పుడు టైటిల్ని గెలిచింది. అందుకే షారుఖ్ ఇంతలా ఎమోషనల్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చి అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. కుటుంబ సభ్యులతో కలిసి మైదానం నలువైపులా తిరిగి మ్యాచ్‌కు విచ్చేసిన క్రికెట్ ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు.