మంగళవారం, 18 నవంబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 నవంబరు 2025 (13:00 IST)

South Africa Beat India: భారత్ ఫట్.. బుమ్రా సారీ చెప్పడంతో నెటిజన్లు ఫిదా

South Africa Beat India
South Africa Beat India
ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా ఆదివారం జరిగిన తొలి టెస్టులో భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు నవంబర్ 22-26 వరకు గౌహతిలో జరుగుతుంది. 
 
15 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికా భారతదేశంలో సాధించిన తొలి టెస్ట్ విజయం ఇది. తొలి టెస్టు మూడో రోజున 124 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయంతో మిగిలిన మ్యాచ్‌లో పాల్గొనడానికి అందుబాటులో లేడని ప్రకటించడంతో భారత్ 93/9 పరుగులకే ఆలౌట్ అయింది.
 
సైమన్ హార్మర్ 4/21 వికెట్లు తీసుకోగా, మార్కో జాన్సెన్ 7-3-15-2తో తిరిగి వచ్చాడు. వాషింగ్టన్ సుందర్ 92 బంతుల్లో 31 పరుగులు చేశాడు. కానీ బౌలర్లకు అనుకూలంగా ఉండే పిచ్‌పై భారత్ స్పందన చాలా తక్కువగా ఉంది. దీంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు.
 
ఇకపోతే.. ఈ పరాజయం అనంతరం భారత రెండో ఇన్నింగ్స్‌లో నాన్‌స్ట్రైకర్‌గా అజేయంగా నిలిచిన జస్‌ప్రీత్ బుమ్రా నేరుగా టెంబా బవుమా దగ్గరకు వెళ్లిన క్షమాపణలు చెప్పాడు. తాను ఉద్దేశపూర్వకంగా అనలేదని వివరణ ఇస్తూ కనిపించాడు. 
 
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో బవుమా బ్యాటింగ్ చేసే సమయంలో బుమ్రా, రిషభ్ పంత్ మధ్య రివ్యూ కోసం జరిగిన సంభాషణ స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యింది. 
 
బవుమా ఎల్బీడబ్ల్యూ విషయంలో రివ్యూ తీసుకోవాలా వద్దా అనే చర్చలో బవుమా మరుగుజ్జు అంటూ బుమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే బుమ్రా సారీ చెప్పడంతో నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు.