సరికొత్త రికార్డులు : 304 రన్స్ తేడాతో భారత్ విజయం!!
ఐర్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళా జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 304 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రికార్డు స్థాయిలో 435 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 131 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ సారా ఫోర్బ్స్ (41) టాప్ స్కోరర్. ఓర్లా (36) ఫర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, తనుజా కాన్వార్ 2.. టిటాస్ సధు, సయాలి, మిన్ను ఒక్కో వికెట్ తీశారు. పరుగులపరంగా భారత్ అత్యధిక తేడాతో విజయం సాధించిన మ్యాచ్ ఇదే. అంతకుముందు ఐర్లాండ్‌పైనే 2017లో 249 పరుగుల తేడాతో భారత మహిళా క్రికెట్ జట్టు గెలిచింది.
ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయి కష్టాల్లో పడిన ఐర్లాండ్‌కు భారత్ కొండంత లక్ష్యం నిర్దేశించింది. 436 పరుగుల టార్గెట్‌ను ఛేదించాలంటే మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడాలి. కానీ, భారత బౌలర్ల దెబ్బకు స్వల్ప వ్యవధిలోనే ఐర్లాండ్ వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ గాబీ లూయిస్ (1), కౌల్టర్ (0) దారుణంగా విఫలమయ్యారు. మరో ఓపెనర్ సారా ఫోర్బ్స్ మాత్రం ఉన్నంతసేపు కాస్త నిలకడగా ఆడింది. ఓర్లా (36)తో కలిసి మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించింది. మరోసారి భారత బౌలర్లు విజృంభించారు. ఓర్లాతోపాటు లారా డెలానీ (10), లేహ్ పాల్ (15), కెల్లీ (2) పెద్దగా ప్రభావం చూపించలేదు.
మరోవైపు, టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్ నుంచే ఓపెనర్లు స్మృతి మంధాన (135), ప్రతీకా రావల్ (154) దూకుడు ప్రదర్శించారు తొలి వికెట్‌కు 233 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వన్డేల్లో భారత్ తరఫున వేగవంతమైన (70 బంతుల్లో) సెంచరీ సాధించిన బ్యాటర్‌గా స్మృతి నిలిచింది. మంధాన పెవిలియన్‌కు చేరిన తర్వాత రిచా ఘోష్ (59)తో కలిసి ప్రతీకా స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. రిచా ఔటైనప్పటికీ తేజల్ (28), హర్లీన్ (15)తో కలిసి ప్రతీకా భారీగా పరుగులురాబట్టింది. ఈ క్రమంలో కెరీర్‌లోనే తొలి సెంచరీని నమోదు చేసింది. దీంతో తొలిసారి టీమ్‌ఇండియా 400+ స్కోరును నమోదు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా 2.. కెల్లీ, ఫ్రేయా, డెంప్సీ తలో వికెట్ తీశారు.