దక్షిణాఫ్రికా జట్టులో ఓ ఆటగాడికి కరోనా.. పేరు మాత్రం చెప్పట్లేదు..

South Africa
సెల్వి| Last Updated: గురువారం, 19 నవంబరు 2020 (14:10 IST)
South Africa
కరోనా ఎవరినీ వదలట్లేదు. ఇప్పటికే పలువురు క్రీడాకారులు కరోనా బారినపడ్డారు. తాజాగా దక్షిణాఫ్రికా జట్టులో ఒక ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. దీంతో ఆ జట్టులో కలవరం మొదలైంది. అతడిని కేప్‌టౌన్‌లోని ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. అలాగే అతడిని కలిసిన మరో ఇద్దరు ఆటగాళ్లను కూడా ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేకంగా ఉంచారు.

ఈ ముగ్గురికీ ఎలాంటి లక్షణాలూ లేవని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు తాజాగా వెల్లడించింది. మరికొద్ది రోజుల్లో ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడే ముందు ఇలా అవడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్‌ 27 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి.

'ఒక ఆటగాడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడిని కలిసిన మరో ఇద్దరినీ ఐసోలేషన్‌కు తరలించాం. మా వైద్య సిబ్బంది నిరంతరం వారిని పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురికీ ఎలాంటి లక్షణాలూ లేవు. ప్రస్తుతానికి వీళ్లని జట్టు నుంచి తప్పించలేదు. అయితే, మరో ఇద్దరు ఆటగాళ్లు కొత్తగా జట్టులో చేరుస్తున్నాం. నవంబర్‌ 21 నుంచి జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో వాళ్లు పాల్గొంటారు' అని ఓ ప్రకటనలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు పేర్కొంది.

కరోనా సోకిన ఆటగాడి పేరును మాత్రం బయటకు వెల్లడించలేదు. మరోవైపు ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి.దీనిపై మరింత చదవండి :